కరోనా వైరస్ పూర్తిగా తగ్గేవరకూ జాగ్రత్త అవసరం..


Ens Balu
3
Kakinada
2021-01-19 20:26:24

కోవిడ్-19 వ్యాధి, కరోనా వైరస్ లను సమూలంగా తుద ముట్టించే వరకూ  అప్రమత్తతను, ఆరోగ్య జాగ్రత్తలను విడనాడ వద్దని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి ప్రజలను కోరారు. కోవిడ్-19 నిరోధం పై ప్రజలను చైతన్య పరచేంచదుకు గడచిన 50 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య విద్య, సమాచార, ప్రచార ముగింపు కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెంటరు వరకూ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి ముఖ్య అతిధిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా గడచిన 9  నెలలుగా ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితమైందని, జిల్లాలో అత్యధిక సంఖ్యలో చేపట్టిన రోగనిర్థారణ పరీక్షలు, క్వారంటైన్మెంట్, చికిత్స కార్యక్రమాల ద్వారా వ్యాధి ఉనికిని గణనీయంగా నియంత్రించ గలిగామన్నారు.  అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జిల్లాలో దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకూ సుమారు 7 వేల మంది ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిచామన్నారు.  వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, దశల వారిగా అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు.  వ్యాక్సిన్ వేయించుకున్న 42 రోజులకు కోవిడ్-19 నిరోధక శక్తి చేకూరుతుందని, కావున వ్యాక్సిన్ వేయించుకున్న వారు 42 రోజుల వరకూ ఆరోగ్య జాగ్రత్తలను కొనసాగించాలన్నారు.   కోవిడ్-19 వ్యాధిని తుదముట్టించే వరకూ ప్రజలు మాస్కు ధారణ, 6 అడుగుల బౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత వంటి జాగ్రత్తలను విడనాడ వద్దని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వి.ఎస్.గౌరీశ్వరరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రాఘవేంద్రరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం, జిజిహెచ్ హెచ్ డి ఎస్ మెంబరు బొడ్డు వెంకటరమణ మూర్తి, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు పాల్గొన్నారు.