వేక్సిన్ పంపిణీలో తూర్పు ముందంజ..
Ens Balu
3
Kakinada
2021-01-19 20:30:15
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుతోందని కలెక్టర్ మురళీధరరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, తొలిదశలో టీకా వేసేందుకు దాదాపు 36,500 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లాలో 190 కేంద్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 33 కేంద్రాల ద్వారా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు చూస్తే మొత్తం 7697 మందికి టీకా అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందు నిలిపినందుకు జేసీ (డీ) కీర్తి చేకూరి, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోలేదని వివరించారు. మిగిలిన వారికి కూడా దశల వారీగా వ్యాక్సిన్ వేయనున్నామన్నారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, సివిల్ సప్లయ్‌స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి; బీసీ, ఎస్‌సీ, మైనారిటీ శాఖల అధికారులు ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, జీఎస్ సునీత, పీఎస్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.