రాష్ట్రంలోనే అత్యధిక పంపిణీ వాహనాలు తూర్పుకే..
Ens Balu
2
Kakinada
2021-01-19 20:32:00
రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1076 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) సహాయంతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరకులను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా అందించనున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వివేకానందహాల్‌లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభిస్తారని, అదే విధంగా జిల్లా స్థాయిలో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద వాహనాల ప్రారంభం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 262 వాహనాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 491, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 222, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 25, ఎస్‌టీ కార్పొరేషన్ ద్వారా 76 వాహనాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యధికంగా రంపచోడవరం నియోజకవర్గానికి 77 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి ఎండీయూకు ఓ నోడల్ వీఆర్‌వోను మెంటర్ లేదా హ్యాండ్ హోల్డింగ్ పర్సన్‌గా నియమించామన్నారు. ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ను ఎలా అందిస్తున్నారో.. అదే విధంగా రేషన్ సరుకులను కూడా 16 లక్షలకు పైగా కార్డుదారులకు డోర్‌డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. తూకాల్లో తేడాలు లేకుండా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు ఈ డోర్ డెలివరీ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. యువతకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో పాటు రేషన్‌కార్డు దారులకు అత్యంత ప్రయోజనం కల్పించే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు రూ.69 కోట్ల ఖర్చుతో వాహనాలను సమకూర్చడంలో వివిధ కార్పొరేషన్ల అధికారులతో పాటు బ్యాంకర్ల సహాయం ఎంతో ఉందని ప్రశంసించారు. ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్‌స్ అధికారులు సమష్టిగా కృషిచేశారన్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల వల్ల ఇటు బ్యాంకులు, అటు లబ్ధిదారుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వలంటీర్ వ్యవస్థ విజయవంతమైందని, వివిధ సందర్భాల్లో వారు అందించిన సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయిలో మొబైల్ వాహన లబ్ధిదారులు సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారం అందించినట్లు వెల్లడించారు. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ సంస్థలు కార్యక్రమంలో భాగస్వాములయ్యాయని, బాగా అధ్యయనం చేసిన తర్వాత వాహనాల రూపకల్పన జరిగిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు వాహనాలు చేరిన తర్వాత, అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీకి ముందే వాహనాల లబ్ధిదారులు నిర్దేశ మార్గాలను పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో రేషన్ వాహనాలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సత్వర సహాయం అందించేందుకు వీలుగా అదనంగా వాహనాలు సిద్ధంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా నాణ్యమైన సరుకులను ఇంటివద్దకు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సచివాలయాల వారీగా బియ్యం కార్డుల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసిందన్నారు. ప్రతి ఎండీయూలో డిజిటల్ వెయింగ్ మెషీన్, ధరల నోటీస్ బోర్డు, అనౌన్స్మెంట్ మైక్, ఈ-పోస్ మెషీన్, ఛార్జింగ్ పాయింట్ తదితరాలు ఉంటాయని జేసీ తెలిపారు. వాహనాల లబ్ధిదారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.