ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-01-19 20:57:42

విశాఖజిల్లా లో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ,  డిఆర్ డిఏ, డిసిసిబి అధికారులతో,  రైసు మిల్లర్ల సంఘ ప్రతినిధుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖ లు సమన్వయం తో పనిచేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఏజెన్సీల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ( Control room no.7702003580 ) కు తెలియజేయాలని సూచించారు. జిల్లా లో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని రైసుమిల్లర్లను కోరారు. 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నాణ్యత ప్రమాణాల నిర్దారణ కు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారెంటీ లకు సంబంధించి, రైసు మిల్లర్లకు ఇతర జిల్లాల్లో కల్పించిన విధంగా వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకట రమణ, డిఎస్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.