రేషన్ పంపిణీ విజయవంతం చేయాలి..
Ens Balu
3
Srikakulam
2021-01-20 13:10:16
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాహనాల ద్వారా ఫిబ్రవరి 1 నుండి పంపిణీ చేయనున్న ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. గురువారం నుంచి రేషన్ పంపిణీ విధులు నిర్వహించే 534 వాహనదారులకు శిక్షణ కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్ లో బుధవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి జిల్లాలో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో రేషన్ తీసుకునే ప్రతీ ఒక్కరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాహనదారులకు ఉందని అన్నారు. గురువారం నుండి ప్రతీ వాహనదారుడు తమ పరిధిలో గల గ్రామాలను సందర్శించి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే విధానంపై ముందుగా కార్డుదారులకు తెలియజేయాలని సూచించారు. ఫిబ్రవరి 1 నుండి జిల్లావ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని, ఈలోగా వాహనాల ద్వారా పంపిణీచేసే కార్యక్రమంపై కార్డుదారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతీ వాహనదారుడు వారికి కేటాయించిన మండలానికి చెందిన తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉప తహశీల్ధారులు, గ్రామ రెవిన్యూ అధికారి, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకులు, వాలంటీర్లతో పరిచయాలను పెంచుకొని, ఎళ్లవేలల అందుబాటులో ఉంటూ మీ విధులను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని కలెక్టర్ కోరారు. నిన్నటి వరకు మీరంతా ప్రైవేట్ వ్యక్తులని, నేటి నుండి ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్న విషయాన్ని ప్రతీ వాహనదారుడు గమనించాలని అన్నారు. 25 లక్షల మంది జనాభాలో కేవలం 534 మందికి మాత్రమే ఇటువంటి అవకాశం లభించిన విషయాన్ని గుర్తెరగాలని తెలిపారు. మీ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తూ అన్నం పెట్టే అవకాశం మీకు లభించిందని, కావున ప్రతీ వాహనదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాహనాలను స్వంత పనులకు వినియోగించరాదని, అలాగే వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయరాదని సూచించారు. పల్లె ప్రాంతాలకు వెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాలను అతివేగంగా నడుపరాదని పేర్కొన్నారు. లబ్ధిదారులతో మర్యాదగా నడుచుకోవాలని, ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారునితో సంబంధం లేకుండా వారి కుటుంబసభ్యులకైనా అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇటువంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగడం లేదని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పథకాల్లో ఇది ఒకటని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువచ్చే ప్రతినిధులుగా పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పొందిన 534 మంది వాహనదారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్ యం.నవీన్, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు రామారావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ .కృష్ణారావు, పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ, సహాయ సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్, ఉప తహశీల్ధారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.