జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-01-20 14:01:46
వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం సమాచారశాఖ డిడి మణిరామ్ ను కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ లోని సమాచారాశాఖ కార్యాలయంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను డిడి మణిరామ్ కు వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓనెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని యూనియన్ అధ్యక్షుడు డిడికి వివరించారు. అంతేకాకుండా జీఎస్టీ పరిధిలోకి రాని న్యూస్ ఏజెన్సీలు, చిన్న పత్రికలకు జీఎస్టీ నిబంధన రద్దుచేయాలని, ఆన్ లైన్ విధానంలో ప్రెస్ క్లిప్పింగులు అధిక సంఖ్యలో సమర్పించడానికి వీలు పడనందున, నేరుగా పత్రికలుగానీ, క్లిప్పింగుల ఫైల్స్, స్వీకరించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిడి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమర్పించిన సమస్యలను, డిమాండ్ లను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని జర్నలిస్టులకు తెలియజేశారు. అదేసమయంలో జర్నలిస్టులు వ్రుత్తిలోకి వచ్చేవారంతా కనీస డిగ్రీ అర్హత కలిగివుండేటట్డు చూసుకోవడం, ఉన్నత విలువలతో జర్నలిస్టుగా మసలు కోవడం ద్వారా ప్రభుత్వ గుర్తింపు కూడా వెంటనే వచ్చే అవకాశం వుంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులంతా టెక్నాలజీకి చేరువక కావాలని డిడి సూచించారు. ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం ద్వారా మరింత అవగాహన పెరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా అవకాశం వుంటుందని పేర్కొన్నారు. డిడిని కలిసిన వారిలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.