నేల స్వభావాన్ని బట్టి మొక్కలు నాటాలి..
Ens Balu
4
Vizianagaram
2021-01-20 16:59:03
ప‌్రతి మొక్క అన్ని రకాల నేలల్లోనూ వృద్ధి చెందే అవకాశం వుండదని..ఆయా నేల స్వభావాలకు తగిన మొక్కలనే గుర్తించి నాటేందుకు చర్యలు చేపట్టాలని తద్వారా జిల్లాలో పచ్చదనం పెంచేందుకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. దీర్ఘకాలంలో పెరిగే మొక్కలు కాకుండా తక్కువ వ్యవధిలోనే వృద్ధి చెందే మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సామాజిక అటవీ అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువులు సంచరించే ప్రాంతాల్లో పశువులు తినే అవకాశం లేని మొక్కలను నాటాలన్నారు. మొక్కలకు తగిన సంరక్షణ, రక్షణ వున్నచోట పూలు, పళ్లజాతుల మొక్కలను నాటవచ్చని సూచించారు. మొక్కలు నాటడంతోపాటు ఇప్పటికే వున్న మొక్కలు, చెట్లు, వృక్ష సంపదను పరిరక్షించుకోవడానికి కూడా చర్యలు చేపట్టాల్సి వుందని కలెక్టర్ చెప్పారు. మొక్కలు చెట్లను నరికివేతకు పాల్పడటం వంటి చర్యలు నిరోధించడానికి కూడా అధికారులు తమ పరిధిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు చెట్లకు ప్రకటన బోర్డులను మేకులు వేసి ఏర్పాటు చేసే వారిపై అందుబాటులో వున్న చట్ట నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మొక్కలు, చెట్లకు ఎక్కడ బోర్డులు తగిలించి వున్నా వ్యక్తిగతంగా స్పందించి వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులు లేదా సంస్ధలపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో లేదా ఇళ్లలో వున్న చెట్లు నరికినా వాటి స్థానంలో అంతకు రెట్టింపు స్థాయిలో మొక్కలు నాటితేనే చెట్లు నరికేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంస్థలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. రోడ్ల వెడల్పు కార్యక్రమం కోసం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలు చెట్లు తొలగించాల్సి వస్తే ముందుగా తొలగించే చెట్ల స్థానంలో వేరేచోట మొక్కలు నాటిన తర్వాతే చెట్లను తొలగించాలన్నారు. మొక్కలు, చెట్ల నుండి రాలే ఆకులను తగులబెట్టడం వల్ల వాటికి సమీపంలోని మొక్కలు, చెట్లు నశిస్తున్నాయని, దీనికి ప్రత్యామ్నాయంగా రాలిపోయిన ఆకులను ఎరువుగా వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యక్తులు, జంతువుల పరిరక్షణకు క్లబ్‌లు ఏర్పాటు చేసిన తరహాలోనే మొక్కలు, చెట్ల పరిరక్షణకు కూడా క్లబ్‌లు ఏర్పాటుచేసే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కల పరిరక్షణ, సంరక్షణకు పాటుపడేందుకు సంస్థలు, వ్యక్తులు అండగా నిలవాల్సి వుందని, ఇందుకు ఈ క్లబ్‌లు దోహదం చేస్తాయన్నారు. జిల్లా అధికారులంతా తమ ఇళ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. తమ ఇళ్లలో మొక్కలు నాటేందుకు తగిన స్థలం అందుబాటులో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మనం పేర్కొంటున్నట్టు నిత్యావసర వస్తువులంటే బియ్యం, పప్పులు తదితర సరుకులు కాదని స్వచ్ఛమైన గాలి, నీరు, నేలనే నిత్యావసరాలుగా భావించాలన్నారు. పర్యావరణాన్నిప్రకృతిని పరిరక్షించుకోవడం, పెంపొందించడం అనే అంశాలపై పిల్లల్లో సానుకూల భావాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం చేపట్టిన మొక్కలు పెంచే కార్యక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పారిశ్రామిక విధానంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. పర్యావరణహిత పరిశ్రమలనే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు విధాన నిర్ణయం తీసుకుందన్నారు.
జిల్లాలోప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వచ్చే ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా సఫల్ పేరుతో ఒక ప్రాజెక్టు మంజూరు కానుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని దాదాపు వంద గ్రామాల్లో పూర్తిస్థాయిలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన అనంతరం కేంద్రం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మంజూరు చేస్తోందన్నారు.
మొక్కలు నాటడంతోపాటు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలకు, పరిశుభ్రత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దీనిలో భాగంగానే 14వ ఆర్ధిక సంఘం నిధులను పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లా సామాజిక అటవీ అధికారి బి.జానకిరావు మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 1.24 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని జిల్లాకు కేటాయించగా లక్ష్యానికి మించి 1.25 కోట్ల మొక్కలు నాటడంద్వారా మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.సమావేశంలో జిల్లా అటవీ అధికారి సచిన్‌గుప్తా, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ డి.డి. కిరణ్ కుమార్, డిఆర్‌డిఏ ఏపిడి సావిత్రి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డి.పి.ఎం. పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.