ప్రభుత్వ పథకాల అమలులో విజయనగరమే నెం-1
Ens Balu
4
Vizianagaram
2021-01-20 17:01:14
రాష్ట్ర ప్రభుత్వం త్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకాల అమలులో రాష్ట్రం లోనే జిల్లా ప్రధమంగా నిలిచింది. లక్ష్యాలను సాధించడానికి ప్రత్యేక అధికారులను నియమించి, బ్యాంకర్లతో నిరంతరం చర్చిస్తూ ముందుకు వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ రూపొందించిన ప్రత్యేక వ్యూహం ఇందుకు తోడ్పడింది. ఈ మూడు పథకాల అమల్లో జిల్లా గణనీయమైన పురోభివృద్దిని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మూడు పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి అమలు చేశారు. జిల్లా అధికారులను పరుగులు పెట్టించడమే కాకుండా, తాను సైతం స్వయంగా పలు బ్యాంకులకు వెళ్లి తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్లు కూడా వివిధ బ్యాంకులను తనిఖీ చేశారు. పథకాల పర్యవేక్షణకు డిఆర్‌డిఏ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా ఒక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటిడిఏ పివో, జాయింట్ కలెక్టర్(ఆసరా), సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓ, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించారు. వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, వాటిని విశ్లేషించి, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలు వరకూ సిద్దంగా ఉండి పనిచేసింది. వివిధ శాఖల పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో, ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో 24 గంటలూ అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రత్యేక కార్యాచరణ కారణంగా ఈ పథకాల అమలు వేగవంతం అయ్యింది. వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద 2106 దరఖాస్తులు అందగా శతశాతం లక్ష్యాలను సాధించడం ద్వారా, రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జగనన్న తోడు పథకం క్రింద ఇప్పటివరకు 19,004 దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించి 98.69 శాతం రుణాలను అందించాయి. వై.ఎస్.ఆర్ బీమా క్రింద 3,91,377 బ్యాంకు ఖాతాలను నమోదు చేసి 69.40 శాతాన్ని సాధించడం జరిగింది. ఇంకను 21,535 దరఖాస్తులు నమోదు చేయవలసి ఉండగా వీటిని కూడా వేగంగా పరిశీలించి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతిష్టాత్మక మైన మూడు పథకాల అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిపినందుకు కలెక్టర్ అధికారులను అభినందిస్తూ ఈ స్థానాన్ని కొనసాగించేలా చూడాలన్నారు.