పాడైన రోడ్లు స్వరూపాలన్నీ మార్చేస్తున్నాం..


Ens Balu
1
Visakhapatnam
2021-01-20 18:03:56

రాష్ట్రంలో  రహదారుల  అభివృద్ది,  పునఃనిర్మాణానికి   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్  రెడ్డి  ప్రత్యేక  దృష్టి  సారించారని రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం .శంకర నారాయణ  తెలిపారు. బుధవారం  ఆయన, శాఖ ముఖ్య కార్యదర్శి  ఎం .టి . కృష్ణబాబు తో కలిసి నగరంలో  నిర్వహించిన   ప్రాంతీయ  సమీక్షా సమావేశంలో  శాఖ పని తీరు, పనుల పురోగతిపై   సమీక్షించారు. అనంతరం  మంత్రి మీడియతో  మాట్లాడుతూ  రాష్ట్రంలోని  రహదారుల  పరిస్దితిపై  నాలుగు ప్రాంతాలలో  సమీక్షా  నిర్వహిస్తున్నామని  అందులో భాగంగా     తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం  జిల్లాల   స్దితిగతులపై   విశాఖపట్నంలో  సమీక్ష నిర్వహిస్తున్నామని  తెలిపారు.  యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమత్తులు  చేపట్టడానికి రూ 1000 కోట్లు మంజూరు  చేసామని,  మార్చి నెలాఖరులోగా  ఈ నిధులను ఖర్చు చేయాలని ఆదేశించినట్లు  తెలిపారు.   “నివర్” తుఫాను  వల్ల నష్టపోయిన  ప్రాంతాలలో రోడ్లరిపేరుకు రూ .200 కోట్లు  కేటాయించినట్లు  తెలిపారు.  రాష్ట్ర రహదారుల అభివృద్ది సంస్థ ద్వారా రాబోయే  3 సంవత్సరాల  కాలంలో   రోడ్ల అభివృద్దికి  రూ. 2200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు  తెలిపారు. పెట్రోలు, డీజిల్  అమ్మకాలపై  లీటరుకు  రూ. 1 చొప్పున రోడ్ సెస్ విధించి, ఆ నిధులను  రహదారుల  అభివృద్దికి  ఖర్చు  చేస్తున్నట్లు  తెలిపారు.    న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్ డి బి)  సహకారంతో  రూ. 6000 కోట్లు  నిధులతో రాష్ట్రంలో   జిల్లా  కేంద్రాల నుంచి  మండల కేంద్రాలకు  డబుల్ లైన్ రోడ్లు  వేస్తున్నామని, 450 బ్రిడ్జిలు  పున నిర్మాణం చేస్తున్నామని  తెలిపారు.  ఇందులో  మొదటి  దశలో రూ. 2500 కోట్ల పనులకు  టెండర్లు  పిలిచామని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని  అనుసరించడం వలన రూ. 85 కోట్లు  ఆదా అయిందని  తెలిపారు.  ఇంకా  నాబార్డు  సంస్థ  నుంచి  నీడా పథకం కింద  రూ. 1150 కోట్లతో రహదారులను   అభివృద్ది చేస్తున్నట్లు  తెలిపారు.  ముఖ్యమంత్రి  వై  ఎస్  జగన్ మోహన్ రెడ్డి , కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీతో  సంప్రదించి రాష్ట్రానికి  రూ.  12500 కోట్ల  జాతీయ  రహదారుల  పనులను  మంజూరు చేయించారని  తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం నిమిత్తం  అవసరమైన  భూమి సేకరణకు  ప్రత్యేక  కార్యాచరణ  ప్రణాళిక  రూపొందిస్తున్నట్లు  తెలిపారు.  భూ సేకరణ  జరిగిన రెండున్నర   ఏళ్లలో  ఈ పనులు  పూర్తి అవుతాయని  తెలిపారు.       రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి   ఎం టి కృష్ణబాబు  మాట్లాడుతూ రహదారుల పనుల  పురోగతిలో  భూ సేకరణ  కీలకమని,  అందుకే   జిల్లా యంత్రాంగంతో  సమన్వయంతో   భూ సేకరణ పై ప్రత్యేక  శ్రద్ద వహిస్తున్నామని   తెలిపారు. ఈ కార్యక్రమంలో   నాలుగు  జిల్లాల ఈ  ఎన్ సి లు , ఎస్ ఇ లు,  ఇ ఇ లు, డి ఇ లు పాల్గొన్నారు.