అనంతలో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
4
Anantapur
2021-01-20 18:37:55
ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామని, ఇందుకు సంబంధించి గురువారం ఉదయం కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి రేషన్ సరుకులు ఇస్తామని చెప్పారని, అందుకనుగుణంగా ప్రతినెలా ఒకటో తేదీన ఇస్తున్న పెన్షన్ తరహాలో ఇంటివద్దకే బియ్యం, ఇతర రేషన్ సరుకులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జిల్లాలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణచే కార్యక్రమం ప్రారంభం అవుతుందని, జిల్లా కేంద్రంలోని తపోవనం వద్ద జాతీయ రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రేషన్ సరుకుల పంపిణీ కోసం జిల్లాకు 754 మినీ ట్రక్కులు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ) చేరాయని, జిల్లాలో 3012 రేషన్ షాపుల పరిధిలో 11, 75,522 రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 754 మినీ ట్రక్కులకు 754 మంది డ్రైవర్స్ కం ఓనర్స్ ను ఏర్పాటు చేశామని, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి శాశ్వత ఉపాధి కల్పించేలా డ్రైవర్స్ కం ఓనర్స్ నియామకం చేసినట్లు తెలిపారు. అందులో ఎస్సీ కార్పొరేషన్ నుంచి 158 మందిని, ఎస్టీ కార్పొరేషన్ నుంచి 39 మందిని, బీసీ కార్పొరేషన్ నుంచి 360 మందిని, ఈ బీసీ కార్పొరేషన్ నుంచి 126 మందిని, మైనార్టీ కార్పొరేషన్ నుంచి 68 మందిని, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి 3ని మొత్తం కలిపి 754 మందిని సామాజిక సమతుల్యం కలిసి ఉండేలా డ్రైవర్స్ కమ్ ఓనర్స్ ని ఎంపిక చేసి నియమించినట్లు తెలిపారు. దీనిద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులకు శాశ్వత ఉపాధి దొరికినట్లు అయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అణగారిన ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు.
ఒక మినీ ట్రక్ కొనుగోలు కోసం ప్రభుత్వం 5,81,190 రూపాయలను కేటాయింపు చేయడం జరిగిందని, అందులో 10 శాతం అంటే 58,119 రూపాయలు లబ్ధిదారుల వాటా కాగా, 30 శాతం అంటే 1,74,357 రూపాయలను బ్యాంకు రుణంగా, 60 శాతం సబ్సిడీ అంటే 3,48,714 రూపాయలు సబ్సిడీ కింద మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు ద్వారా అందజేసిన లోన్ మొత్తాన్ని 6 సంవత్సరాలలోపు ప్రతినెల ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించాలన్నారు. ఒక మినీ ట్రక్కు ఆపరేటర్ కు ప్రతి నెలా 10 వేల రూపాయల పారితోషికం, ప్రతి నెల 3 వేలు హమాలీ చార్జీలు, ప్రతినెల ఇంధనం కోసం 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు రేషన్ షాప్ వద్దకి వచ్చి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దకే సరుకుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందమైన స్టిక్కరింగ్, లోగోలతో మినీ ట్రక్కులు సిద్ధం చేయడం జరిగిందని, సరుకులు ఏ విధంగా పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుందో ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో కార్బో బాడీతో మినీ ట్రక్కులు తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఒక్కో మినీ ట్రక్కులో ఈపాస్ యంత్రం చార్జింగ్ పాయింట్, క్యాష్ బాక్స్, రబ్బర్ మ్యాట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మైకు, త్రాసు హ్యాంగర్, లైటింగ్, అవసరమైన స్థలం, ఫ్యాను, మిగతా అన్ని రకాల పరికరాలతో మొబైల్ వాహనాన్ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక ఓనర్ కమ్ ఆపరేటర్ కు ప్రత్యేకంగా ఒక యూనిఫామ్ ఇస్తున్నామని, చాలా దూరం నుంచి కనపడే విధంగా రూపొందించిన ప్రత్యేక టీషర్టు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు.
సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా ఒక్కో మినీ ట్రక్ ఆపరేటర్ కు ఒక విఆర్వోను అనుసంధానం చేస్తూ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసేటప్పుడు ఈపాస్ మిషన్ ద్వారా కొలిచి తూకం వేసి అక్కడే సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆపరేటర్లకు, వీఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడం, ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 90 కుటుంబాలకు ఇంటివద్దకే రేషన్ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని, 15 - 20 రోజుల్లోగా ప్రతి ఒక్క రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏరోజు ఎవరికీ ఇస్తామనేది తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు గ్రామ సచివాలయాలను ప్రారంభించేటప్పుడు 1207 గాను 1000 సచివాలయాలలో మొదటిరోజు సర్వీసులను అందించడం జరిగిందని, జిల్లాలోని రేషన్ షాపుల పరిధిలో ఫిబ్రవరి ఒకటో తేదీన మొదటిరోజు 90 కుటుంబాలకు ఇంటివద్దకే రేషన్ ఇచ్చేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినీ ట్రక్కు ఆపరేటర్లకు సంబంధించి బ్యాంకు ఎకౌంటు, రుణాలు అందించే కార్యక్రమం, రిజిస్ట్రేషన్ లు, ఇన్సూరెన్స్ లని 90 శాతం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వారికి సంబంధించి వెంటనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇంటి వద్ద రేషన్ సరుకులు పంపిణీ లో ప్రతి ఒక్క అంశం పై శ్రద్ధ తీసుకోవడం జరిగిందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.