గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి..
Ens Balu
3
2021-01-20 18:57:24
72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగా స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గం.ల నుండి నిర్వహించే ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ చే పతాకావిష్కరణ, జండా వందనం, జిల్లా ప్రజల నుద్దేశించి ప్రసంగం, సాయుధ దళాల సాంప్రదాయ కవాతు, విద్యార్థినీ విద్యార్థులచే దేశ భక్తి పూరిత సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పురస్కాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కోరారు. సమయాభావం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సర వేడుకలలో శకటాల ప్రదర్శనను, స్టాళ్ల ఏర్పాటులను రద్దు చేసామన్నారు. వేడుకల నిర్వహణకు వేదిక, మైదానాలను సిద్దం చేయాలని సుశిక్షిత దళాలతో సాంప్రదాయ కవాతు నిర్వహించాలని పోలీస్ శాఖను కోరారు. వేడుకల సందర్భంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులను, ప్రాంగణంలో పారిశుద్యం, హాజరైన ప్రజలకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని కాకినాడ మున్సిపల్ కమీషనర్ ను కోరారు. అలాగే జిల్లా ప్రగతి అంశాలు పొందుపరిచిన ముఖ్య అతిధి ప్రసంగ ప్రచురణ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లను సమాచారశాఖకు సూచించారు. ముందు జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్యసిబ్బంది, మందులతో ప్రధమ చికిత్సా శిభిరం, ఆంబులెన్స్ లను, అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఫైటింగ్ పరికరాలు, వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అతిధులకు, ఆహ్వానితులకు సుముచిత మర్యాదలు, అల్పాహార ఏర్పాట్లను చేపట్టాలని, కాకినాడ ఆర్డిఓ, అర్బన్ తహశిల్దారులను కోరారు. విద్యార్థుల రవాణాకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని ఉపరవాణా కమీషనర్ ను కోరారు. గత ఏడాది కాలంలో ఎదురైన సవాళ్లను, వత్తిడులను సమర్ధవంతంగా ఎదుర్కొని జిల్లా అభివృద్దికి, ప్రజా రక్షణ, సంక్షేమానికి అంకిత భావంతో పనిచేసిన అధికారులను అభినందించేందుకు 26వ తేదీ సాయంత్రం బీచ్ రోడ్ లోని శిల్పారామంలో హై-టీ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ దినకర్ స్వప్నిల్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఎన్ సి సి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రజత్ సోంథీ, ఎపిఎస్పి 3వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ భద్రయ్య్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.