ఏపీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తాం..
Ens Balu
3
Visakhapatnam
2021-01-20 19:22:10
భవిష్యత్ లో శాస్త్రవేత్తల పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేసే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గత పొరపాట్లను సరి చేస్తూ మంచి భవిష్యత్ ను నిర్మిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైన నైపుణ్య వనరులపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ ను మంత్రి మేకపాటి బుధవారం సందర్శించారు. అక్కడ ఏర్పాటైన 'స్కిల్ విజ్ఞాన్ సెంటర్' ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బయోటెక్నాలజీ ఆధారిత స్కిల్ సెంటర్ తో భవిష్యత్ లో వైద్య, పరిశోధనారంగంలో రాణించాలనుకునే యువతకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైద్యరంగ పరిశోధనలు, టెక్నాలజీ, నైపుణ్యంపై మంత్రి ప్రసంగాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అభినందించారు. ఇంత వరకూ ఏ మంత్రి ఈ స్థాయి అవగాహనతో, అండగా నిలబడి మాట్లాడలేదని సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నతనం నుంచే మంచి విలువలు, సంస్కృతి, క్రమ శిక్షణ, అంకితభావం నిండిన మానవవనరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ధ్యేయమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే ప్రజలకు వసతులను సులువు చేసే ఆవిష్కరణలు చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. టెక్నాలజీ, పరిశోధనలు, ఆవిష్కరణలు, వైద్య రంగం పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ మొక్కలా మొదలై మహావృక్షంలా మారుతుందని మంత్రి కొనియాడారు. అంతకు ముందు మెట్ టెక్ జోన్ ప్రాంగణంలో కొలువై ఉన్న అత్యాధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వస్తువులు, వాటికి ఉపయోగించే వస్తువలను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. కరోనా సమయంలో మాస్కులు, వెంటిలేటర్ల తయారీలో లాక్ డౌన్ ని కూడా లెక్కచేయకుండా శ్రమించిన మెడ్ టెక్ జోన్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మెడ్ టెక్ జోన్ లోనే రూ. లక్ష ఇరవై ఐదువేలతో తయారైన ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీ, సెన్సార్లు, కెమెరాలతో రోగి వ్యాధిని గమనించి, చికిత్స చేసే ఓ యంత్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రఖ్యాత నగరాల్లోనూ ఇంకా అందుబాటులోకి రాని ఈ ఆవిష్కరణ పనితీరును మెట్ టెక్ జోన్ సీఈవో జితేందర్ శర్మను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడ్ టెక్ జోన్ సీఈవో జితేందర్ శర్మ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, విశాఖపట్నం పరిశ్రమల శాఖ అధికారులు, మెడ్ టెక్ జోన్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.