మతసామరస్యాలకు తావుండకూడదు..


Ens Balu
2
Srikakulam
2021-01-20 20:16:21

మతసామరస్య సంఘటనలకు తావులేకుండా తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కమిటీ సభ్యులను కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న మతసామరస్య సంఘటనలపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోలీసు శాఖ తక్షణమే స్పందించడంపై హర్షాన్ని వ్యక్తం చేసారు. సంతబొమ్మాళిలో జరిగిన సంఘటనపై 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనతో ముగిసిపోయే అంశం ఇదికాదని, ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు కమిటీ సభ్యులకు అందిస్తామని, ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటుచేసి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఇందుకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా కమిటీలను వేయడం జరుగుతుందని అన్నారు.  జిల్లాలోని దేవాలయాలు, చర్చిలు, మశీదులు, బుద్ధిష్ఠ్, జైనుల దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సి.సి కెమెరాలను ఏర్పాటుచేసి ప్రతీ అంశం రికార్డు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రికార్డ్ అయ్యే హెచ్.డి.ఆర్ భద్రంగా ఉండే ప్రదేశంలో ఉంచేలా చూడాలని అన్నారు. జిల్లాలో శిధిలావస్థలో ఉండే దేవాలయాలు, విగ్రహాల ఫొటోలను ముందుగా తీసుకోవాలని, అటువంటి విగ్రహాలు సాదారణంగా విరిగిపోయినప్పటికీ విగ్రహాల ధ్వంసం క్రింద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అటువంటి వాటిని గ్రామస్తులకు ముందుగా తెలియజేసి వాటిని రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సభ్యుల సలహాలు కోరిన కలెక్టర్ సభ్యుల సూచనలను తప్పక పరిశీలిస్తామని పేర్కొన్నారు.        జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కమిటీ సభ్యులు స్పందించి, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. ఎక్కడా ఏ సంఘటన జరిగినా తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, కావున దానికంటే ముందుగా సభ్యులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరిగిన ప్రదేశాల్లో మత విధ్యంసాలకు తావులేకుండా, సభ్యులు చూడాలని సూచించారు. సంఘటన జరిగినపుడు ఎటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని, అటువంటి సంఘటనలు ఎదురైనపుడు ప్రశాంతంగా ఉంటూ, పోలీసులకు సమాచారం ఇచ్చేవిధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు.  సంఘటన జరిగిన తరువాత తీసుకునే చర్యలు కంటే ఆ సంఘటనను ఆపే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 291 గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటుచేయడం జరిగిందని, 29 గ్రామాల్లో కమిటీలను ఏర్పాటుచేసామని చెప్పారు.  తదుపరి గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ప్రతీ దేవాలయం, మశీదు, చర్చిలలో ఒక పుస్తకాన్ని ఉంచుతున్నామని, సాదారణంగా వచ్చే భక్తులు కాకుండా రాత్రివేళల్లో వచ్చే భక్తులు ఎవరైన ఉంటే వారి వివరాలు ఈ పుస్తకంలో నమోదుచేయాలని చెప్పారు. అలాగే ప్రత్యేక సందర్భాలలో నిర్వహించే పూజలు, యాత్రలు తదితర వివరాలు కూడా ఈ పుస్తకంలో నమోదుచేయడం వలన తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. సంతబొమ్మాళి విషయమై మాట్లాడిన ఆయన సి.సి కెమెరాల సహాయంతో సంఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, కాబట్టి ప్రతీ దేవాలయం, చర్చి , మశీదులలో సి.సి.కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.        ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ వి.హరిసూర్యప్రకాష్, హిందూ మత ప్రతినిధి బుర్రా ఆదినారాయణ శాస్త్రి, ముస్లిం మత ప్రతినిధి మహ్మద్ అబ్ధుల్ రఫీ, క్రిస్టియన్ మత ప్రతినిధి రెవరెండ్ డా. జాన్ జీవన్, బుద్ధిష్ట్ మత ప్రతినిధి  పేకేటి రామారావు , జైన్ మత ప్రతినిధి బాబూలాల్ హీరావత్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.