రహదారులకు భూసేకర వేగవంతం చేయాలి..
Ens Balu
2
Vizianagaram
2021-01-20 20:20:11
రాయిపూర్ నుండి విశాఖపట్నం వరకు మంజూరైన ఆరు వరసల జాతీయ రహదారికి సంబంధించిన భూ సేకరణ వేగంగా జరగాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా మీదుగా పలు జాతీయ రహదారులు మంజురైనాయని, జిల్లా అభివృద్ధికి ఈ రహదారులు ఎంతగానో ఉపకరిస్తాయని, వీటికి ప్రత్యెక ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్య కార్యదర్శి జాతీయ రహదారులకు, భోగాపురం ఎయిర్ పోర్ట్ , ఇతర ప్రాజెక్టులకు సంబం ధించిన భూ సేకరణ పై సమీక్షించారు. విశాఖపట్నం నుండి రాయిపూర్ వరకు మంజురైన ఆరు వరసల జాతీయ రహదారి 2200 కోట్ల రూపాయల అంచనా ఖర్చు తో చేపట్టనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 95 కిలో మీటర్ల పొడవు గలిగిన ఈ రహదారి 9 మండలాలకు చెందిన 49 గ్రామాల్లో 516 హెక్టార్ల లో భూ సేకరణ చేయవలసి ఉందని అన్నారు. ఈ 95 కిలో మీటర్ల పరిధి లో ఉన్న అటవీ భూమి క్లియరెన్స్ చేయాలనీ, అదే విధంగా విద్యుత్ స్తంభాల తొలగింపు, జల వనరుల గుర్తింపు, వ్యవసాయ, ఉద్యాన తోటల లెక్కింపు తదితర పనులు వేగంగా జరగాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేయాలనీ, క్షేత్ర స్థాయి లో సమన్వయం తో పనిచేసి త్వరగా గ్రౌన్దింగ్ జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి రోజు లక్ష్యాలను కేటాయించి గడువును విధించి, ఆ గడువు లోగా పూర్తి చేయని వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడే క్లియరెన్స్ చేసుకొని, క్లియర్ అయిన వాటికీ వెంట వెంటనే అవార్డు పాస్ చెయ్యాలన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి పై వంతెన పనుల కోసం చర్యలు చేపట్టాలన్నారు. విజయనగరం జిల్లాలో చేపడుతున్న బై పాస్ రహదారుల పురోగతిపై సమీక్షించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతం కావాలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, పార్వతి పురం సబ్ కలెక్టర్ విధేకర్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఆర్.డి.ఓ భావనిశంకర్, భూ సేకరణ అధికారి జయరాం, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్.ఈ జయ శ్రీ , విద్యుత్ సఖ, జలవనరులు, ఉద్యాన, అటవీ, పంచాయతిరాజ్, ఇతర శాఖల అధికారులు, హాజరైనారు.