పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-20 20:31:11

జివిఎంసి పరిధిలోని వసూలు కావలసిన ఆస్తి పన్నులను వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం, వి.ఎం.ఆర్.డి.ఎ చిల్డ్రన్ ఎరీనా థియేటర్ లో అదనపు కమిషనర్ ఆషా జ్యోతి, డి.సి(ఆర్),    జోనల్ స్థాయి అధికారుల నుండి వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శుల స్థాయి వరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, నీటి చార్జీలు, డి.&ఓ. లైసెన్స్ ఫీజులు. కళ్యాణ మండపాలు, దుకాణాలు, మార్కెట్లు నుండి రావాల్సిన ఫిజులు, అద్దెలు నూరు శాతం వసూలు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 350కోట్లు టార్గెట్ పట్టామని, ప్రస్తుతం రూ. 227.40కోట్లు వసూలైనదని  మిగిలినవి ఫిబ్రవరి చివరి నాటికి 95శాతం వసూలు చేయాలని ప్రతీ రెవెన్యూ అధికారికి లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకు ముందుగానే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కలక్షన్ ను మెరుగు పరచాలని ఆదేశించారు. 75 శాతం కన్నా తక్కువ పన్నులు వసూలు చేసిన రెవెన్యూ అఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు మరియు వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శుల యొక్క జీతాలు ఆపాలన్నారు. మార్కెట్ విలువ ప్రకారం దుకాణాలు, కళ్యాణ మండపాలు అద్దెలు ఏ విధంగా ఉన్నాయి, వారు జివిఎంసి కి ఏ విధంగా చెల్లిస్తున్నారు, వారం రోజులలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.                   ప్రజలకు సేవలు, మౌళిక వసతులు కల్పనే లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను స్థాపించిందని, అందుకు వార్డు కార్యదర్శులుగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో వస్తారని, వారు పెట్టుకున్న ఆర్జీలను సిటిజన్ చార్టు ప్రకారం నిర్ణీత గడువులో పూర్తీ చేయాలని లేని యెడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్డు పరిపాలనా కార్యదర్శులను హెచ్చరించారు. కొంతమంది కార్యదర్శులు డైరీలు రాయకపోవడం గమనించి, వారి యొక్క జీతాలు నిలిపి వేయాలని అధికారులను ఆదేశించారు.    ` ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆషా జ్యోతి, డి.సి.(రెవెన్యూ) ఏ. రమేష్ కుమార్, అందరు జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.