ఘనంగా గిడుగు 81వ వర్థంతి..
Ens Balu
3
Srikakulam
2021-01-22 13:49:52
తెలుగుభాషకు వెలుగునిచ్చిన మహోన్నతమైన వ్యక్తి గిడుగు రామ్మూర్తిపంతులు అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కె. వేణుగోపాల్, మీడియా జేఏసీ కన్వీనర్ శాసపు జోగినాయుడు అన్నారు. శుక్రవారం వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తిపంతులు 81వ వర్థంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాఫప్రసాద్ అధ్యక్షతన స్థానిక కిమ్స్ రోడ్డులో ఉన్న గిడుగు విగ్రహానికి జర్నలిస్టు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొంక్యాన మాట్లాడుతూ సరళమైన తెలుగుభాష కోసం ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తిపంతులని, సవర భాష కోసం విశేషమైన కృషి చేశారన్నారు. సిక్కోలు జిల్లాలో పుట్టి ప్రపంచ స్థాయిలో తెలుగువాడు గర్వించేలా చేసిన రామ్మూర్తిపంతులు పేరిట కొత్తగా వచ్చే ఏదో ఒక యూనివర్శిటీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా జేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ గిడుగు పేరిట యూనివర్శిటీ, స్మారక గ్రంథాలయం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. తెలుగుభాష వికాసానికి కృషి చేసిన మహనీయుడు శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపక వృత్తి నుంచి అంతర్జాతీయ స్థాయిలో తెలుగుభాష అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి సిక్కోలువాసి కావడం గర్వకారణమన్నారు. తొలుత ప్రముఖ గజిల్స్ గాయకులు డాక్టర్ మంతిన వాసుదేవాచారి గిడుగు రామ్మూర్తి పేరిట పలు గజిల్స్‌ను ఆలపించి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్‌ఎం బెండి శివప్రసాద్, వాకర్స్ క్లబ్ ప్రతినిధి రాధాకృష్ణ, మీడియా జేఏసీ ప్రతినిధులు సూరు చంద్రశేఖర్, డోల అప్పన్న, నేతల అప్పారావు, కొర్లాన కొండబాబు, ఎం.ఏ.వి.సత్యనారాయణ, పేడాడ పృథ్వీ, కొంక్యాన శివశంకర్, పక్కి వేణు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.