దుష్ప్రచారాలను త్రిప్పికొట్టాలి..
Ens Balu
4
Srikakulam
2021-01-22 14:14:02
శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను త్రిప్పికొట్టి, మత విధ్వేషాలను రెచ్చగొట్టే పనులకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక వైశ్యరాజు కన్వెన్షన్ హాలులో గ్రామ దేవాలయాల భద్రతలో భాగంగా గ్రామ సంరక్షణ దళాలు మరియు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సంఘాలతో అవగాహన కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యస్.పి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసి మతవిధ్వేశాలను రెచ్చగొట్టేందుకు కొందరు చూస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని గ్రామ సంరక్షణ దళాలు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు యస్.పి పిలుపునిచ్చారు. దాడులను ఎదుర్కోవడమే కాకుండా అందులో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ర్రచారాలను త్రిప్పికొట్టాల్సిన బాధ్యత గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులపై ఉందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గ్రామ ప్రజలు, వి.డి.యస్ లు, పోలీసులు భాద్యతగా వ్యవహరించినపుడే దేవాలయాలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్టవేయగలమని, ఇందుకు పోలీసు శాఖకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని యస్.పి కోరారు.
ప్రతీ దేవాలయం, చర్చి, మశీదులలో సి.సి.కెమెరాలతో పాటు పుస్తకాన్ని ఏర్పాటుచేసామని చెప్పారు. అలాగే గ్రామస్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటుచేసిన సంగతిని యస్.పి గుర్తుచేసారు. ప్రతీ కమిటీలో సర్పంచ్ తో పాటు వి.డి.యస్, మహిళా సంరక్షణ కార్యదర్శి, వివిధ మత పెద్దలతో పాటు మహిళా పోలీసు కూడా ఉంటారని పేర్కొన్నారు. గ్రామ మహిళా సంరక్షణ దళాలు వారి గ్రామంలోని మశీదు, చర్చి , దేవాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎప్పటికపుడు సమావేశాలను ఏర్పాటుచేసుకొని నిత్యం సంరక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలేనని గాంధీజీ పిలుపునిచ్చారని, అటువంటి పట్టుకొమ్మల సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని యస్.పి వివరించారు. ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి, సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దేవాలయాలపై దాడులు జరిగినపుడు మతవిధ్వేషాలకు తావులేకుండా పోలీసులకు సమాచారం ఇచ్చేలా గ్రామస్తులను చైతన్యపరచాలన్నారు, అనంతరం గ్రామ సంరక్షణ దళాలకు టీ-షర్ట్ లను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వావిలపల్లి జగన్నాథం నాయుడు, వి.భార్గవ ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్నదాడులను కొందరు ఆకతాయిలు చేసే పనిగా అభివర్ణించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాల వలన సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని, కావున దాడులు జరిగిన ప్రదేశంలోని వాస్తవాలను మాత్రమే ప్రజలకు చేరవేయాలని తెలిపారు. గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు నిత్యం తమ పరిధిలోని దేవాలయాలను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పి.సోమశేఖర్, క్రైమ్ అడిషనల్ యస్.పి. టి.పి.విఠలేశ్వర్, టౌన్ డి.యస్.పి యం.మహేంద్ర , పోలీస్ అధికారులు, గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.