ఉపాది హామీ పథకం పూర్తిస్థాయిలో అమలు..


Ens Balu
5
Tadepalle
2021-01-22 14:20:37

ప్రతి వారం ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించుకుంటూ  ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి డ్వామా పిడిల సమీక్షా సమావేశంలో ఆయన రెండో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. మెటీరియల్ కంపోనెంట్ కు సంబంధించిన పనులు తమకు సంబంధం లేదన్నట్టుగా డ్వామా పిడిలు వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఉపాధి పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని, నాణ్యత ప్రమాణాలతో పనులు జరిగేలా చూసి, అవినీతి, నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి  అన్నారు.  జాతీయస్థాయిలో ఎక్కువ కుటుంబాలకు 'ఉపాధి' పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో వుందని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించి దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిల్చిందని అంటూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 8న ఒకే రోజు 54.42 లక్షల మందికి పని కల్పించి కొత్త రికార్డు సృష్టించామని మంత్రి అన్నారు. కోవిడ్ నేపథ్యంలో కొత్తగా 4 లక్షల జాబ్ కార్డులు జారీ చేశామని, తద్వారా 15 లక్షల మంది వలస కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించి, వారికి అండగా నిలిచామని, ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన కూలీలకు ఉపాధిని సక్రమంగా అందిస్తే, వారు తిరిగి వలస వెళ్ళకుండా చూడవచ్చని, ముఖ్యమంత్రి కూడా వలసలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. డ్వామా పిడిలు దీనిని ప్రధమ  ప్రాధాన్యతగా తీసుకోవాలని పెద్దిరెడ్డి చెప్పారు.  ఈ ఏడాది మన రాష్ట్రానికి కేంద్రం 25.25 కోట్ల పనిదినాలు ఆమోదించిందని, ఇప్పటి వరకు 22.44 కోట్లు పనిదినాలు వేతనదారులకు కల్పించామన్న మంత్రి మిగిలిన రెండు నెలల్లో మరో 5 కోట్ల పనిదినాలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. డ్వామా పిడిలు, ఎంపిడిఓలు సమన్వయంతో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, మండల స్థాయిలో ఎంపిడిఓ కార్యాలయాలకు కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమిస్తే, వచ్చే ఏడాది దాదాపు 30 కోట్ల పనిదినాలు వస్తాయని, కొన్ని జిల్లాల్లో రైతులు తమ పంట పొలాలకు డొంకరోడ్లు కావాలని కూడా అడుగుతున్నారని, సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవసరమైన చోట్ల రోడ్లు వేయాలని, ఉపాధి హామీ పనులు ప్రజల అవసరాలకు ఏ మేరకు వినియోగించగలమో శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వున్న వంద రోజుల పనిదినాలను 150 రోజులకు పెంచాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు.   మెటీరియల్ కాంపోనెంట్ పనుల కింద చేపట్టిన భవనాలు, సిసి రోడ్లు, డ్రైన్ నిర్మాణం మార్చ్ 31లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని, ఈ ఏడాది దాదాపు రూ.4వేల కోట్ల మేర మెటీరియల్ నిధులున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేయాలని అంటూ, వచ్చే ఏడాది దాదాపు రూ.5వేల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కనుక దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణంలో వున్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4,158.34 కోట్లతో 10,929 గ్రామ సచివాలయ భవనాలను ప్రభుత్వం మంజూరు చేయగా వీటిలో 1418 భవనాలు ఇప్పటికే పూర్తయ్యా యని, మిగిలిన 9511 భవనాలు నిర్మాణంలో వున్నాయని, అలాగే రూ.1502.38 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 8,585 వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వం మంజూరు చేయగా, 8547 ప్రగతిలో ఉండగా, 38 భవనాలు పూర్తయ్యా యని, రైతుభరోసా కేంద్రాల కోసం రూ.2268 కోట్లు కేటాయించగా 10,316 ప్రగతిలో ఉన్నాయని, రూ.386.68 కోట్లతో 8859 అంగన్ వాడీ కేంద్రాలను మంజూరు చేయగా ఇప్పటికే 4429 పూర్తయ్యాయని, మిగిలిన భవన నిర్మాణ పనులన్నీ మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వీటితోపాటు పాలసేకరణ కేంద్రాలు, సిసి డ్రైన్లు, పాఠశాల ప్రహరీ గోడలు తదితర మెటీరియల్ కాంపోనెంట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, జలకళ కింద బోర్ల డ్రిల్లింగ్ పనులు వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డ్వామా పిడిలు తమ తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, ఇజిఎస్ సంచాలకులు పి. చిన్నతాతయ్య, వాటర్ షెడ్ సంచాలకులు పి. వెంకటరెడ్డి, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, ఎ. కళ్యాణ చక్రవర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.