గ్రంథాలయ సెస్సులు సకాలంలో చెల్లించండి..


Ens Balu
3
శ్రీకాకుళం
2021-01-22 14:25:40

వివిధ సంస్ధలు గ్రంథాలయాలకు చెల్లించాల్సిన సెస్సులను చెల్లించి భాషాభివృద్ధికి సహకరించాలని శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి శుక్ర వారం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ మాతృభాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. భాష, సంస్కృతి ఔన్నత్యాన్ని మెరుగు పరచుటకు, అభివృద్దికి ప్రభుత్వానికి నివేదికను కమిటి సమర్పిస్తుందని తెలిపారు. భాషాభివృద్ధికి ఏ విధమైన సహకారం అవసరమో తెలుసుకొనుటకు కమిటి పర్యటనలను చేస్తుందని అన్నారు. తాళపత్ర గ్రంధాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మునిసిపాలిటిలు, పంచాయతీలు తదితర సంస్ధలు గ్రంధాలయ సెస్సులను వసూలు చేస్తున్నాయని వాటిని ఎప్పటి కప్పుడు చెల్లించడం ద్వారా గ్రంధాలయను అభివృద్ధి చేయవచ్చన్నారు. గ్రంధాలయాలకు పేద పిల్లలు వస్తారని వారికి మంచి సౌకర్యాలతోపాటు మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుటకు అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రంధాలయాలు యువతకు విజ్ఞానం, వికాసం, ఉపాధి కల్పిస్తుందని దానిని మరింతగా యువత వినియోగించుకునే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉదని అన్నారు. జానపద కళలకు పెద్దపీట వేసి పరిరక్షించుకోవాలని, అవి గొప్ప సంపద అన్నారు. వీటన్నింటిపైన సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఛైర్మన్ చెప్పారు.