భక్తులలో భగవంతుణ్ణి చూస్తూ సేవచేయాలి...ధర్మారెడ్డి
Ens Balu
2
Tirumala
2020-08-15 19:13:47
శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శనివారం ఉదయం 74వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి ఉద్యోగులు సేవకులని, కావున అంకితభావంతో మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. భక్తులు శ్రీవారి దర్శనం, వసతి, ప్రసాదాల కొరకు దళారుల బారిన పడకుండ, దళారులను నిర్మూలించిన టిటిడిలోని అన్ని విభాగాలు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఎస్వీబీసీ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామని, ఇందులో విసూచి మహా మంత్రం, సుందరకాండ, విరాటపర్వం పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు సుందరకాండ పారాయణం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది భక్తులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రతి రోజు దాదాపు 100 మందికి పైగా భక్తులు క్యూఆర్ కొడుతూ ఒక రూపాయి నుండి రూ.2 కోట్ల వరకు విరాళాలు అందిస్తున్నారన్నారు.
దాతల సహాకారంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు రూ.9 కోట్లతో అత్యాధునిక పరకామణి భవనానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో రూ.30 కోట్లతో తిరుమల నడక దారిలో పై కప్పును నిర్మిస్తామన్నారు. తిరుమల ఎస్వీ మ్యూజియంను మరింత ఆకర్షణీయంగా రూపొందించడంలో భాగంగా రూ. 15 కోట్లతో శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3 డి ఇమేజింగ్‌ను, శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు, ప్రాశస్త్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మ్యూజియం మొదటి అంతస్తులో శ్రీవారి ఆభరణాలు 3 డి డిజైన్‌తో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తిరుమలలోని అన్ని వసతి సమూదాయాలు, అతిథి గృహాలను అధునీకరిస్తున్నామని, ఇందులో గీజర్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు ఘాట్ రోడ్లలో మరమత్తు పనులు, ప్రమాదాలు నివారించేందుకు నూతన పిట్ట గొడను నిర్మిస్తున్నామన్నారు. కరోనా సమయంలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని, తిరుమలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారని అదనపు ఈవో ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు హరీంద్రనాధ్,సెల్వం,బాలాజీ, నాగరాజ, దామోదరం, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ అధికారి విజయసారధి, వీఎస్వో మనోహర్, క్యాటరింగ్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు.