70 లక్షలు మొక్కలు నాటారు..సంరక్షణ మరిచారు..
Ens Balu
5
తాడేపల్లి
2021-01-22 14:31:18
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం కార్యక్రమం కింద 70 లక్షల మొక్కలు నాటమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన డ్వామా పీడిల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనం నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని, చాలా చోట్ల ట్రీ గార్డులు కనపడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ట్రీగార్డ్ ల ఏర్పాట్లకు పిడిలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రానున్న 60 రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాకి రెండు కోట్ల పనిదినాలు కల్పించాలని, ఉపాధి హామీ, వైఎస్ఆర్ జలకళ పనులను వేగవంతం చేయాలని అన్నారు. మెటీరియల్ కు సంబంధించి ఇంకా రూ.1500 కోట్లు వినియోగించుకోవాల్సి వుంది కనుక భవన నిర్మాణాలపై పిడి డ్వామాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అనుసంధాన శాఖ అధికారులను సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళ్ళాలని అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిజం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలు, సిసి డ్రైన్లు, పాఠశాల ప్రహరీ గోడలు తదితర మెటీరియల్ కాంపోనెంట్ పనులను మార్చి 31 లోపు పూర్తి చేయాలని, వైఎస్ఆర్ జలకళ బోర్ల పనులను ఒక సవాల్ గా తీసుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని తమను తాము నిరూపించుకోవాలని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల పనిదినాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డ్వామా పిడిలు తమ తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, ఇజిఎస్ సంచాలకులు పి. చిన్నతాతయ్య, వాటర్ షెడ్ సంచాలకులు పి. వెంకటరెడ్డి, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, ఎ. కళ్యాణ చక్రవర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.