మాతృభాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి..


Ens Balu
2
శ్రీకాకుళం
2021-01-22 14:43:10

మాతృభాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి శుక్ర వారం జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలుగు భాషా, సంస్కృతి పరిరక్షించుకోవాలన్నారు. తెలుగు భాష గొప్పదని పేర్కొన్నారు. మాతృభాషలో తీపిదనాన్ని, ఔన్నత్యాన్ని, మధురత్వాన్ని మరచిపోరాదని పేర్కొన్నారు. పూర్వ కాలం నుండి తెలుగు భాషకు వైభవం ఉందని, తాళపత్ర గ్రంధాలలో సైతం ఎంతో అమూల్యమైన భాషా సాంస్కృతిక సంపద నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. తంజావూరులో 2,300 తెలుగు తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని చెప్పారు. తాళపత్ర గ్రంధాలను ప్రస్తుత అక్షర రూపంలోకి మార్చుతూ డిజిటలైజేషన్ జరుగుతోందని అన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలని తద్వారా అందులో మధురానుభూతిని ఆస్వాదించగలమని అన్నారు. చిన్నప్పటి నుండి మాతృభాషను నేర్చుకోవాలని, కేరళ, తమిళనాడు, కన్నడంలో మాతృభాషకు గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చిన్నతనం నుంచి ఉన్నత స్థాయి వరకు మాతృభాషపై మమకారం ఉండాలని అన్నారు. శ్రీకాకుళంలో కథానిలయం గొప్ప స్ఫూర్తి అన్నారు. విద్య ద్వారా భాషను నేర్చుకోకపోతే భాష అంతరించిపోయే అవకాశం ఉంటుందని సూచించారు. ఇంగ్లీషు వంటి ఇతర భాషలు నేర్చుకున్నప్పటికి మాతృభాషపై మమకారం విడవరాదని హితవు పలికారు. తెలుగులో ఉన్న గొప్ప గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా రాబోయే తరాలకు గొప్ప వారసత్వ సంపద అందించగలమన్నారు. భాషతో అన్యోన్యత పెరగాలని, తెలుగు సంస్కృతి పరిరక్షణకు కృషి జరగాలని అన్నారు. తెలుగు నేల సంస్కృతి, కళలకు పుట్టినిల్లని పేర్కొంటూ వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పూర్వీకుల నుండి వస్తున్న సంపద అని భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. తెలుగు వ్యక్తిగా ప్రతి ఒక్కరూ భాషా, సంస్కృతుల ఔన్నత్యానికి పాటుపడాలని కోరారు. చిన్నప్పటి నుండి భాషపై ఔపోసన పట్టాలని అన్నారు.           ప్రత్యేక ఆహ్వానితులు వి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కమిటీ శ్రీకాకుళం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గొప్ప సాహితీ, సాంస్కృతిక సంపద ఉందని, ఆధునిక సాంస్కృతిక కేంద్రం ఉత్తరాంధ్ర అని అన్నారు. సాహిత్య ఉద్యమాలు నడిచిన నేల అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు నడిపిన వ్యావహారిక ఉద్యమం మరుపురానిదని పేర్కొంటూ కథానిలయం స్పూర్తితో రాజమండ్రిలో నాటక నిలయం ఆవిర్భావం జరిగిందని చెప్పారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష అభివృద్ధికి కృషి జరగాలని సూచించారు. స్థానిక యాస, జానపద, పొడుపు కథలు, జీవన శైలి తదితర అంశాలపై పరిశోధనలకు ప్రోత్సహించాలని కోరారు. శ్రీకాకుళం వాసి కాళీపట్నం రామారావు రచించిన యజ్ఞం పుస్తకంపై దాదాపు 16 మంది పి.హెచ్.డి కోసం పరిశోధనలు చేయడం గర్వకారణమన్నారు. అండమాన్ నికోబర్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో శ్రీకాకుళం వాసులు ఉన్నారని, శ్రీకాకుళం వాసులు సాహితీ, సాంస్కృతిక సంపద పరిరక్షణలో అద్వితీయమని అన్నారు. అండమాన్ నికోబర్ లో సీబీఎస్ ఇ పరీక్షలలో సైతం సాంఘిక శాస్త్రం పరీక్షను తెలుగులో రాయుటకు అనుమతి పొందిన ఘనత అచ్చటి తెలుగు వారు సాధించిన విజయమన్నారు. ఉపాధ్యాయులలో సాహితీ కృషీ వలురను గుర్తించి ప్రోత్సహించాలని డిఇఓ కు సూచించారు. పుస్తకాలు చదవడం అనేది అలవాటుగా మారాలని, నిత్య కృత్యం కావాలని అన్నారు. 10వ తరగతి లోపు విద్యార్థులను వారి ఆసక్తి మేరకు గ్రూపులుగా విభజించి అనువైన పుస్తకాలను గూర్చి తెలియజేయాలని, వాటిని చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. కస్తూర్బా విద్యాలయంలో మంచి పుస్తకాలు ఏర్పాటు చేయాలని ఏపిసికి సూచించారు. ఏ విద్యార్థి ఎన్ని పుస్తకాలు చదివారో తెలుసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా లభ్యంగా ఉంచాలని తద్వారా ఆసక్తి పెరుగుతుందని అన్నారు. కమిటి సభ్యులు పి వి ఎన్ మాధవ్, కత్తి నరసింహ రెడ్డి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మర్యాద పూర్వకంగా కమిటీ ఛైర్మన్ ను కలసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లాలో రూపొందించిన కళింగాంధ్ర దేశ చరిత్ర, శ్రీకాకుళం - ఏ స్టోరీ ఆన్ స్టోన్ పుస్తకాలను ఛైర్మన్ కు, సభ్యులకు అందించారు. జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై. యశోద లక్ష్మీ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పివి రమణ, జిల్లా వృత్తి విద్య అధికారి ప్రకాశరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాష అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, కమిటీ డిప్యూటీ కార్యదర్శి జి.విజయ రాజు, డిప్యూటీ విద్యా శాఖ అధికారి జి.పగడాలమ్మ,  ఇంటాక్ కన్వీనర్ కెవిజే రాధా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.