జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-22 16:25:51

వర్కింగ్ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు న్యూఢిల్లీ లోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అనుసరిస్తున్న నిబంధనలను అనుసరించి అక్రిడిటేషన్ కార్డులు జారీచేయాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం శుక్రవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది.  ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరును కలిసి జర్నలిస్టుల సమస్యలు, అక్రిడిటేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు, హెల్త్ కార్డులు, ఇన్స్యూరెన్స్, ఉద్యోగ భద్రత, జర్నలిస్టుల పై జరుగుతున్న దాడుల విషయమై కలెక్టర్ కు వివరించారు. ప్రతీఏడాది  అక్రిడిటేషన్ విషయంలో కొత్త నిబంధనలు పెట్టడం కాకుండా న్యూఢిల్లీలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అవలంభిస్తున్న నిబంధనలతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. మీడియా సంస్థలు వేజ్ బోర్డును అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓనెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని, కేంద్ర ప్రభుత్వమే రూ.40 లక్షలు దాటితేనే జీఎస్టీ నెంబరు, రిటర్న్స్ ధాఖలు చేయాలని స్పష్టం చేసిన విషయాన్ని కలెక్టర్ కు  యూనియన్ అధ్యక్షుడు వివరించారు. అంతే కాకుండా జీఎస్టీ పరిధిలోకి రాని  న్యూస్ ఏజెన్సీలు, చిన్న పత్రికలకు జీఎస్టీ నిబంధన రద్దుచేయాలని, ఆన్ లైన్ విధానంలో ప్రెస్ క్లిప్పింగులు అధిక సంఖ్యలో సమర్పించడానికి వీలు పడనందున, నేరుగా పత్రికలుగానీ, క్లిప్పింగుల ఫైల్స్ స్వీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు.  దీనిపై కలెక్టర్ వి.వినయ్ చంద్ స్పందిస్తూ తాను ఈ విషయాన్ని నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని, మీడియాకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలుసుకునేలా  జర్నలిస్టులు  ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలు, అర్హతలపై ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎక్కడైనా ప్రధాన సమస్యలను ఆధారాలతో మంచి కధనాలు రాయడం ద్వారా సంబంధిత సమస్యలపై చర్యలు తీసుకోవడానికి వీలుపడుతందని సూచించారు. అనంతరం స్మార్ట్ సిటీ వేల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు కలెక్టర్ కు వివరించి యూనియన్ 2021 డైరీనికి కలెక్టర్ కు అందజేశారు. అంతే కాకుండా ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సందర్భంగా ఎన్నికల కమిషన్ అవార్డుకి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఎంపిక కావడాన్ని పురష్కరించుకొని యూనియన్ సభ్యులంతా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.