ఏయూ అభివృద్దికి సహకారం అందిస్తాం..
Ens Balu
2
Visakhapatnam
2021-01-23 19:17:56
ఆంధ్రవిశ్వవిద్యాలయం అభివృద్దికి తాము సహకారం అందిస్తామని కాన్‌స్టెల్ గ్రూప్ హెడ్ ఆఫ్ గ్లోబల్ కాంప్లియెన్స్ వీణ జన అన్నారు. శనివారం ఉదయం ఆమె ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మహిళలకు ఉపయుక్తంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడతామన్నారు. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. త్వరలో దీనిపై నిర్ధిష్ట ప్రణాళికతో వస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగు పరచే చర్యల్లో భాగంగా వివిధ పరిశ్రమలతో కలసి పనిచేస్తున్నామన్నారు. వర్సిటీలో జరుగుతున్న పరిశోధనల ప్రగతిని వివరించారు. వర్సిటీకి సహకారం అందించడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల సంస్థ ప్రతినిధి వీణ జనను అభినందించారు. కార్యక్రమంలో ఏయూ పాలక మండలి సభ్యులు వి.ఎస్ ఆంజనేయ వర్మ, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, కాకినాడ కస్టమ్స్ సూపరిండెంట్ జి.వి.వి.ఎస్.వి.ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.