ప్రతీ ఒక్కరూ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
2
Kakinada
2021-01-25 13:39:00
ఓటరుకు ఓటే వజ్రాయుధమని.. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు హక్కుపై ప్రజల్లో స్ఫూర్తి కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరై, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారత ఎన్నికల సంఘం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానిక్ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్ కార్డు)పై ఓటర్లకు అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తొలిసారిగా 2011, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగానికి సంబంధించి వివిధ దేశాలతో పోల్చితే దురదృష్టవశాత్తు మన దేశంలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారత ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తోందని.. ఈవీఎంలు, వెబ్ క్యాస్టింగ్ వంటి ప్రక్రియలను జోడించిందన్నారు. గతంలో పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేదని, ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా పోలింగ్ కేంద్రాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించినట్లు వివరించారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఓ మనిషి తన జీవిత కాలంలో వివిధ ఎన్నికల్లో దాదాపు 20సార్లు ఓటు వేసే అవకాశం వస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని.. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్లో ఫామ్-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా 2021, జనవరి 25 నుంచి సురక్షితమైన ఎలక్ట్రానిక్ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్ కార్డు)ను మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ డిజిటల్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓటు హక్కు అనేది దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని.. ఈ హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వినియోగించుకోవాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారి రూపంలో ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి చేకూరుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును పొందడం, వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం సరళీకృత విధానాలను అమలుచేస్తోందని వివరించారు. తొలిసారిగా ఓటు హక్కు ఉపయోగించుకోనున్న యువతకు ఎస్‌పీ శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ఎలాంటి ఒత్తిడికి గురవకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయనున్నట్లు కొత్తగా ఓటు హక్కు పొందిన డిగ్రీ విద్యార్థిని గంటుబోయిన సాయిలత పేర్కొన్నారు.
యువ ఓటర్లు, ఉత్తమ అధికారులకు సత్కారం:
‘ఓటర్లకు సాధికారత కల్పించడం, అప్రమత్తంగా ఉంచడం, సురక్షితంగా మరియు సమాచారం అందించడం (Making Our Voters Empowered, Vigilant, Safe and Informed) ఇతివృత్తంతో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ యువ ఓటర్లు సరగాడ హరిత, గంటుబోయిన సాయిలత, ఓలేటి పవన్, దాసరి భవానీ శంకర్‌లను సత్కరించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబరచిన 46 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశాంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ అధికారి హిమబిందు, అదనపు ఎస్‌పీ కరణం కుమార్, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ ఎం.జగన్నాథం, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువ ఓటర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్ఎంసీ విద్యార్థులు హాజరయ్యారు.