ఓటు వినియోగంతోనే సమాజ నిర్మాణం..
Ens Balu
3
Srikakulam
2021-01-25 14:13:19
శతశాతం ఓటింగ్ ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. సోమవారం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి బాపూజీ కళామందిర్ వరకు భారీ రాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశం ప్రజాస్వామ్య దేశమని, ఓటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పునాది అని, రాజ్యాంగం ప్రసాదించిన ఒక వరమని అన్నారు. 18 సం.లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. మంచి నాయకుల ఎంపిక ఓటింగు ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఓటు హక్కు కలిగిన వారంతా బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మంచి నాయకులను ఎన్నుకుని ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా 1952 వ సం.లో ఏర్పాటు అయ్యిందని తెలిపారు. ఒక్కప్పుడు 17 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు ప్రజలలో మంచి చైతన్యం వచ్చిందన్నారు. 2019 ఎలక్షన్ లో 80 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. ఇది ఒక మంచి పరిణామమని అన్నారు. ఇక ముందు శతశాతం ఓటింగ్ జరగాలన్నారు. 2019 లో నోటా ఓటింగ్ ను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఎన్నికలలో పాల్గొన్న అభ్యర్ధులపై విశ్వాసం లేనట్లయితే నోటా ఓటు ద్వారా తిరస్కరించవచ్చునని తెలిపారు. సుమార్ వెయ్యి నుండి 15 వేల మంది నోటా ఓటును 2019 ఎన్నికలలో వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, ఎపిక్ (EPIC) ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఆన్ లైన్ ద్వారా ఓటును నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కలిగించారని కావున యువత ఈ ప్రక్రియ ద్వారా తక్షణమే ఓటును నమోదు చేసుకుని, ఓటు హక్కును శతశాతం సద్వినియోగపరచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్, ట్రైనీ కలెక్టర్ నవీన్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, నగర పాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, సచివాలయ సిబ్బంది, ఎన్.సి.సి. విద్యార్ధినీ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.