రిపబ్లిక్ డేకి పూర్తిస్థాయి ఏర్పాట్లు..
Ens Balu
1
Srikakulam
2021-01-25 14:15:55
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం ఉదయం స్వయంగా పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పేరేడ్ , శకఠాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంసా పత్రాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, చిన్నారులు, కళాకారుల కొరకు వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటుచేయాలని సూచించారు. స్టేడియంకు వచ్చే ఆహుతుల కొరకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను ఏర్పాటుచేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ ను ఆదేశించారు. పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నందున వారికి ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.