మంచి నేతల ఎంపికతో సామాజిక అభివృధ్ధి..


Ens Balu
8
Srikakulam
2021-01-25 14:23:20

మంచి నేతల ఎంపిక ద్వారా సామాజిక అభివృధ్ధి సాధ్యపడుతుందని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం బాపూజీ కళామందిరంలో 11వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన సంయుక్త కలెక్టర్  మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఎన్నికల ప్రక్రియగా అభివర్ణించారు.  సమాజంలో సమస్యలను పరిష్కరించుకుని మంచి పాలనను పొందే అవకాశం కేవలం ఓటింగ్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. గ్రామాలలోను, పట్టణాలలోను నెలకొన్న సమస్యలను పరిష్కరించే వారెవరు అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించే సరైన వారినే  నాయకులుగా ఎన్నుకోవాలన్నారు. 2019 సం.లో జరిగిన ఎన్నికలలో 80 శాతం ఓటింగ్ జరిగిందని తెలిపారు.  స్వాతంత్రం వచ్చిన తదుపరి ఎన్నికలను ప్రతీ 5 సం.లకు ఒక సారి విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీ ఓటుకు ఎంతో విలువ వున్నదన్నారు.  కావున సామాజిక అభివృధ్ధికి తోడ్పడే వారినే నాయకులుగా ఎన్నుకోవాలన్నారు.  కావున ఎలక్షన్ అనేది మంచి పాలనను అందించే నాయకులను ఎన్నుకునే  ఒక పండుగ అని అన్నారు.  పౌరులు  సమస్యలపైన, సమాజంపైన బాధ్యతతో వుండాలన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వుపయోగించుకుని ఎన్నికలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు.  మన ఊరు, మన గ్రామాన్ని అభివృధ్ధి చేసుకోవడానికి యువత పాత్ర కీలకమన్నారు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఓటును సద్వినియోగపరచుకుని,  మంచి నాయకులను ఎన్నుకోవాలని  అన్నారు.  దేశాన్ని పటిష్టవంతంగా రూపొందించాలని పిలుపునిచ్చారు.  18 సం.లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని  దేశాభివృధ్ధికి పాటు పడాలని చెప్పారు.  ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి జీవితంలోను సుమారు 10 నుండి 12 సార్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందని అన్నారు.  కావున ఓటింగ్ ప్రక్రియలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు.  ేముందుగా డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.  ఓటింగ్ పై ప్రతిజ్ఞ, గోడపత్రిక ఆవిష్కరణ చేసారు.  వ్యాస రచనపోటీలు, రంగవల్లుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరిగింది.  స్వాతీ సోమనాధ్, శివకుమార్ల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఓటింగ్ నమోదుపై లఘునాటికలు జరిగాయి.  ఎక్కువ సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజెన్స్ జి.నాగేశ్వరరావు, ఎం.చంద్రమౌళీశ్వరరావు, యు.శ్రీరామ్, మల్లేశ్వరరావు, సత్యన్నారాయణ లకు సన్మానం చేసారు. నూతన ఓటర్లకు  ఓటరు కార్డులను అందించారు.                      ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి,  డా.అంబేద్కర్ విశ్వవిద్యాలయం డి.ఓ.ఎ.  ప్రొ. జి.తులసీరావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన్ రావు, శివానీ కాలేజి డైరక్టర్ డి.వెంకటరావు, సన్ డిగ్రీ కలేజీ డైరక్టర్ జయరావు,  తదితరులు పాల్గొన్నారు.