ప్రధమ స్ధానం పొందిన ఆర్.డబ్ల్యు.ఎస్ శకటం
Ens Balu
6
Srikakulam
2020-08-15 19:47:58
శ్రీకాకుళం ప్రభుత్వ పరుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, విద్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా జల యాజమాన్య సంస్ధ, గృహ నిర్మాణ సంస్ధ, డి.ఆర్.డి.ఏ, అటవీ, వ్యవసాయ, పౌరసరఫరాలు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ, పంచాయతీరాజ్ శాఖలు తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే శకటాలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్.డబ్ల్యు.ఎస్) ప్రధమ స్ధానం దక్కిం చుకోగా, పౌరసరఫరాల శాఖ శకటం ద్వితీయ స్ధానాన్ని, ఐటిడిఏ శకటం తృతీయ స్ధానాన్ని, డి.ఆర్.డి.ఏ శకటం కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నాయి. శకటాలు ప్రదర్శించిన శాఖలతో పాటు బి.సి కార్పొరేషన్, సామాజిక వన విభాగం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ నీటి పారుదల సంస్ధ, పశుసంవర్ధక, మత్స్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు తమ ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసాయి.
లబ్ధిదారులకు పథకాలను అందజేసిన ఇన్ ఛార్జ్ మంత్రి : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో వై.యస్.ఆర్. క్రాంతి పథం క్రింద జిల్లాలోని 2,322 సంఘాలకు బ్యాంకు లింకేజీ క్రింద 92 కోట్ల 1 లక్షా 31 వేల రూపాయల బ్యాంకర్స్ చెక్ ను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి నాని లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం బి.సి.కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రెండు ట్రాక్టర్లను లబ్ధిదారులకు మంత్రి అందజేసారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మరియు జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో పలు సాంస్కతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఇన్ ఛార్జ్ మంత్రి ఆధ్యంతం తిలకించగా ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా డా. తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన భరత ఖండమే నా దేశం పాటకు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించగా, శివ శిష్య బృందం చేసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ, పరిమళ శిష్య బృందం చేసిన నమో నమో భారతాంబే, డా. నీరజా సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో చేసిన భారత జాతి ముద్దు బిడ్డలం అనే పాటలకు చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్దులను చేసాయి.