మౌలిక సదుపాయాలే పర్యాటకానికి కీలకం..
Ens Balu
2
Anantapur
2021-01-25 18:32:19
పర్యాటక రంగంలో మౌళిక సదుపాయాలు కీలకపాత్ర వహిస్తాయని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఆర్. మధుసూధనరావు పేర్కొన్నారు. సోమవారం యూనివర్శిటీలో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా “పర్యాటక రంగంలో స్థితిస్థాపకత వ్యూహాలు” పై ఒక రోజు ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్ ముఖ్య అతిథిగా వీసీ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై పర్యాటక రంగం ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని అన్నారు. పర్యాటక రంగం ఉపాధి మార్కెట్‌కు 40 మిలియన్ల ఉద్యోగాలను అందిస్తుందని అన్నారు. ఆనందం కోసం వివిధ ప్రదేశాలను సందర్శించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కరోనా మహమ్మారి వలన పర్యాటక రంగం ఇతర రంగాలతో పోల్చితే చాలా దెబ్బతిన్నదన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని వ్యూహాలను చర్చించడానికి ఈ వర్క్‌షాప్ అవసరమవుతుందన్నారు. ప్రభుత్వం ,ఇతర వాటాదారులు ఆదాయాన్ని సంపాదించే కుటుంబాలకు వివిధ పర్యాటక ప్రాతాలపైనా అవగాహన కల్పించాలన్నారు. దేశీయ , విదేశీ పర్యాటకుల రాకపోకలను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలు ,ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ మైన సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రదేశాలు, బయో డైవర్సిటీ పార్కులు , పర్వతాలు మరియు ప్రకృతి దృశ్యాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి భౌగోళిక ప్రయోజనం కలిగి ఉంటుందన్నారు. వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ ఎం. త్యాగరాజు, పర్యాటక నిర్వహణ విభాగం విభాగాధిపతి కృషిని వైస్ ఛాన్సలర్ ప్రశంసించారు. వర్క్ షాప్ యొక్క రిసోర్స్ పర్సన్లుగాతమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోదన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు ట్రావెల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమేంద్ర నాథ్ బిశ్వర్లను ఆహ్వానించారు. ఆన్‌లైన్‌లో వంద మంది పైగా వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం.చంద్రయ్య, రెక్టర్; ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుజా ఎస్.నాయర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.