కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కు ఉత్తమ అవార్డు..
Ens Balu
2
Vizianagaram
2021-01-25 18:36:09
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మరో అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆయన ఎంపికైన విషయం తెలిసిందే. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా విజయవాడ లోని ఏ.పి.రాజ్ భవన్ లో సోమవారం ఈ అవార్డును స్వీకరించారు. ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన అన్ని అంశాలనూ జిల్లాలో సకాలంలో పూర్తి చేయడం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కు ఈ అరుదైన అవార్డు లభించింది. జిల్లాలో ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను అప్‌డేట్ చేయడం, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం, అధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, రాజకీయ పార్టీలకు వివిధ అంశాల్లో తరచూ అవగాహన కల్పించడం, స్లీప్ కార్యక్రమాన్ని వినూత్నంగా, విజయవంతంగా నిర్వహించడం, నిరంతరం కొనసాగే కార్యక్రమాలతోపాటు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం, దీనిలో భాగంగా అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగు మార్పులూ, చేర్పులను పూర్తి చేయడం, క్లెయిములను పరిష్కరించడంలో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలవడం తదితర అంశాల ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది.
అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కే. విజయానంద్, రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ సతీమణి శైలజా బాయి కూడా పాల్గొన్నారు.
బెస్ట్ ఇఆర్ఓగా బాలా త్రిపుర సుందరి
ఉత్తమ ఇఆర్ఓగా కెఆర్ఆర్‌సి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ బాలా త్రిపుర సుందరి ఎంపికయ్యారు. ఆమె కూడా సోమవారం రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా రాజ్‌భవన్‌లో అవార్డును అందుకున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు క్లెయిములను పరిష్కరించినందుకు గానూ ఆమెను ఉత్తమ ఇఆర్ఓగా ఎంపిక చేశారు.