భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి..
Ens Balu
2
Srikakulam
2021-01-27 15:31:20
భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా వుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటాక్ హెరిటేజ్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారత దేశ సంస్కృతి చాలా గొప్పదని అన్నారు. ఇది ప్రపంచ దేశాలకే ఆదర్శనీయ మన్నారు. అదే విధంగా మన జిల్లాలో కూడా మంచి సంస్కృతి, కళలు, ప్రకృతి వనరులు వున్నాయన్నారు. ముఖ్యంగా కళింగాంధ్ర చరిత్రను మనందరం తెలుసుకోవాలన్నారు. ఏప్రియల్ నెలలో విద్యార్ధులకు అవగాహన కలిగించు నిమిత్తం, ఇంటాక్ హెరిటేజ్ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మన జిల్లాలోని ప్రజలు వలసలకు వెళ్ళే వారు వున్నారని, దేశంలోని నిర్మాణ పనులు, కట్టడాలలోను మన జిల్లా వాసులు ఎక్కువగా వుంటారని కష్టించే తత్వం కలవారని చెప్పారు. సురంగి మోహన రావు మాట్లాడుతూ, విద్యార్ధులు మన కళలు, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కలిగి వుండాలని భవిష్యత్తరాలకు తెలియ చెప్పవలసిన ఆవశ్యకత వుందని అన్నారు. ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ మాట్లాడుతూ, జనవరి 27, 1984వ సం.లో ఢిల్లీలో ఇంటాక్ హెరిటేజ్ స్థాపించడం జరిగిందని, మన జిల్లాలో 1990వ సం. జనవరి 27న అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.పి.సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతీ ఏటా ఇదే రోజున ఇంటాక్ హెరిటేజ్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగుతున్నదని, విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందచేయడం జరుగుతున్నదని తెలిపారు. మానవతావిలువలను ప్రతీ ఒక్కరు అలవరచుకోవాలన్నారు. అనంతరం క్విజ్, వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్ధినులకు బహుమతులు అందచేసారు. వ్యాసరచన పోటీలలో పి.చాందిని మొదటి బహుమతి, బి.కృప రెండవ బహుమతి, ఎస్.వనిత మూడవ బహుమతికి ఎంపిక అయ్యారు. వక్తృత్వపు పోటీలలో ఎన్.వెంకటలక్ష్మి మొదటి బహుమతి, పి.దేవీ ప్రసన్న రెండవ బహుమతి పొందగా, ఎల్.ఐశ్వర్య మూడవ బహుమతి పొందారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్-ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి, నటకుల మోహన్ రావు, సి.హెచ్.కృష్ణారావు, ఎం.ఆర్.జె.నాయుడు, ఎకడమిక్ కో-ఆర్డినేటర్ శంకరనారాయణ, స్వీప్ స్వఛ్ఛంద సంస్థ డైరక్టర్ కొమ్ము రమణ మూర్తి, యు.ప్రత్యూష, రాజు, విద్యార్ధినులు, తదితరులు పాల్గొన్నారు.