పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-01-27 21:22:08
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని ఆర్డీవోలు ప్రత్యేక కలెక్టర్లు తాసిల్దార్లు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా చదవాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు తు.చ. తప్పకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశలుగా జరుగుతాయన్నారు. ఎన్నికల నియమావళి అనుసరించి తగిన కార్యాచరణ కు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. జీవీఎంసీ లోని 98 వార్డులు, నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాలలో తప్ప మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల నియమావళి అమలవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు, తరచుగా వచ్చే సందేహాలను నివృత్తి చేయడం, ఎలక్షన్ కమిషన్ నుండి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలు నియమ నిబంధనలపై అవగాహనతో ఉండాలన్నారు. ఎన్నికల నియమావళి అమలు నిఘా కమిటీలో తాసిల్దారు, ఎంపీడీవో, సబ్ ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై ప్రచురించిన హేండ్ బుక్స్ లో ఉన్న విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎన్నికలతో సంబంధం ఉన్న ఉద్యోగుల బదిలీలు నిలిపి వేయబడ తాయని ఇదివరలో ఇచ్చి, అమలుకాని ఉత్తర్వులు రద్దు అవుతాయని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డి ఆర్ ఓ ప్రసాద్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జునసాగర్, డిఆర్డిఏ పిడి విశ్వేశ్వర రావు, ఆర్డీవో సీతారామారావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు రంగయ్య, సూర్యకళ, పద్మలత, అనిత, తదితరులు పాల్గొన్నారు.