సజావుగా పంచాయతీ ఎన్నికలు జరగాలి..
Ens Balu
3
Vizianagaram
2021-01-27 21:25:40
పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తగిన ఏర్పాట్లు చేసుకొని ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించేందుకు.. సూచనలు చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు, ఎన్నికల షెడ్యూల్ తదితర అంశాలపై మార్గనిర్ధేశకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్, తేదీలను ప్రకటించక ముందే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను సరిచేసుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నిత, అతి సున్నిత కేంద్రాలను గుర్తించి త్వరితగతిన నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసి తాజాగా కేంద్రాలను గుర్తించాలని, తాజా నివేదికను సమర్పించాలని చెప్పారు. కమిషనర్‌తో జరిగిన మీటింగ్‌లో జిల్లాకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పగా అంగీకారం తెలిపారని.. కావున మొదటి దశలో పార్వతీపురం, రెండు మూడు దశల్లో చీపురుపల్లి, ఎస్.కోట డివిజన్‌లో ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగా అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ లోగా పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ మెటీరియల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో కనీస వసతులైన తాగునీరు, లైట్లు, బల్లలు, కుర్చీలు తదితర ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది తరలింపు, ఎన్నికల సామగ్రి తరలింపు కేంద్రాలను, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసుకొని ఉండాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులను ముందుగానే పరిశీలించుకోవాలని, ఎమైనా మరమ్మతులు ఉంటే చేయించాలని చెప్పారు. ముందుగా డెమో నిర్వహించి బిగ్, మీడియం, స్మాల్ బాక్సుల్లో ఎన్ని ఓట్లు పడతాయో సరిచూసుకోవాలని సూచించారు.
శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి
జిల్లాలో గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే సమస్యాత్మక గ్రామాలను, పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తగిన పోలిస్ సిబ్బంది సహాయం తీసుకోవాలని, దానికి తగిన రిక్వెస్టులు ముందుగానే తయారు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో కుల, మత, వర్గ విభేదాలు రాకుండా.. ఎలాంటి ఘర్షణలు రాకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నియమావళిపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. ఎన్నికల కోడ్ నియమావళి ఇన్ ఛార్జిగా తహశీల్ధార్‌లు వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు బందోబస్తు లేకుండా బ్యాలెట్ బాక్సులను తరలించవద్దని స్పష్టంగా చెప్పారు.
* ముసుగులు వేయండి.. ఫ్లెక్సీలు తొలగించండి*
గ్రామాల్లో జాతీయ నాయకుల విగ్రహాలకు తప్పించి మిగిలిన అన్ని రాజకీయ సంబంధిత విగ్రహాలకు ముసుగులు వేయాలని చెప్పారు. గ్రామాల వరకే కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి.. అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలకు ఎన్నికలు ముగిసే వరకు ముసుగులు వేయాలని.. అలాగే రాజకీయ సంబంధిత, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి ఫ్లెక్సీలూ ఉండరాదని స్పష్టం చేశారు.
ఏకగ్రీవ పంచాయతీల ఫలితాల గురించి అవగాహన కల్పించండి
ఎక్కడైనా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవానికి అవకాశం ఉంటే దానికి తగిన చర్యలు తీసుకోండి అని సూచించారు. అందరూ సమన్వయంతో ముందుకు వస్తే అంగీకరించాలని చెప్పారు. ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి గానీ, ప్రలోభాలు పెట్టడానికి గానీ వీలు లేదు. దీనిలో నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో, ప్రతినిధుల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇరు వర్గాలు సమన్వయంతో.. శాంతియుతంగా వ్యవహరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిర్ణీత గడువులోగా శిక్షణలు
నిర్ణీత గడువులోగా శిక్షణ కార్యక్రమాలు ముగించాలని, దానికి సమాయత్తం కావాలని సూచించారు. శిక్షణలు మూడు దశల్లో నిర్వహించాలని చెప్పారు. ముందుగా ఆర్‌వోలు, ఏఆర్‌వోలు తర్వాత పీవోలు, ఏపీవోలకు శిక్షణ చేపట్టాలని సూచించారు. తదుపరి జరిగే సమావేశంలో నామినేషన్ల పర్వం, తీసుకోవాల్సిన చర్యలు , అభ్యర్థుల అర్హతలు, అనర్హతల గురించి చర్చిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి.సి.కిశోర్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డీఆర్వో ఎం. గణపతి రావు, జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, ఆర్డీవో బిహెచ్ భవానీ శంకర్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీడీవో రామచంద్రరావు, ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.