పంచాయతీ ఎన్నికల్లో ఆర్.ఓల పాత్ర కీలకం..


Ens Balu
4
Srikakulam
2021-01-28 18:10:10

పంచాయతీ సాదారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, కావున ప్రతీ రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రవర్తన నియామావళిని క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆర్.ఓలకు సూచించారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ సాదారణ ఎన్నికలపై ఆర్.ఓలకు, ఏ.ఆర్.ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర కలెక్టర్ అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలవుతుందని, కావున జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించారు. అలాగే ప్రతీ గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంతకం చేసిన తదుపరే ఎన్నికల నోటిఫికేషన్  జారీచేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు వచ్చే సందేహాలను ఆర్.ఓలే నివృత్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ ఒక్కరికీ హేండ్ బుక్ పంపిణీ చేయడం జరిగిందని, వీటితో పాటు శిక్షణ కూడా ఇస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ఆర్.ఓలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని  ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల గుర్తులు, ఇండిపెండింట్లు, ఉండబోవని స్పష్టం చేసారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన అనంతరం తుదిజాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో, ఆయా పేర్లులోని అక్షర క్రమాన్ని అనుసరించి గుర్తులు ( సింబల్స్ ) కేటాయించాలని సూచించారు. ఎన్నికలలో సర్పంచ్ పోటీలలో పాల్గొనే యస్.సి., యస్.టి, బి.సి అభ్యర్ధులు రూ.1500/-లు, ఇతరులు రూ.1000/-లు, అలాగే వార్డు మెంబరుగా పోటీచేసే యస్.సి., యస్.టి, బి.సి అభ్యర్ధులు రూ.1000/-లు, ఇతరులు రూ.500/-లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 10వేలకు పైబడిన జనాభా ఉన్న ప్రాంతాలలో సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్ధులు రూ.2.50లక్షలు, వార్డు మెంబర్లయితే రూ.50 వేలు, అదేవిధంగా 10వేలకు తక్కువ జనాభా గల ప్రాంతాలలో సర్పంచ్ కు రూ.1.50 లక్షలు , వార్డు మెంబర్లయితే రూ.30వేల వరకు ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పోటీచేసేందుకు నిషేధమని, అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన నాటికి ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగరాదని వివరించారు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి సంబంధిత ఫారాలు తప్పనిసరిగా పూర్తిచేసిన పిదపే ఏకగ్రీవంగా ఆమోదించాలని అన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆర్.ఓలు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేసారు. తొలుత శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు ఆర్.ఓలకు, ఏ.ఆర్.ఓలకు పంచాయతీ సాదారణ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.         ఈ శిక్షణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ప్రత్యేక ఉపకలెక్టర్ బి.శాంతి, విజిలెన్స్ అధికారి వెంకటరమణ, డివిజనల్ పంచాయతీ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.