ఆలయాలకు భద్రత కట్టుదిట్టం..


Ens Balu
2
Visakhapatnam
2021-01-28 18:21:10

విశాఖజిల్లాలోని ఆలయాలన్నింటికీ భద్రత కట్టుదిట్టం చేసినట్టు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి తెలియజేశారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో సిసికెమెరాలు నిఘా పెంచామన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆలయాలకు భద్రత పెంచామన్నారు. ప్రతీ గ్రామంలోని సచివాలయ మహిళా పోలీసులు కూడా గ్రామంలో ఆలయాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. వారితోపాటు, ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు. కొందరు కావాలనే దుశ్చర్చలకు పాల్పడకుండా గ్రామస్తులు ఏకమైతే అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షణ దొరుకుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లోని ఆలయాలకు సంబంధించిన సంరక్షణకు సంబంధించి అటు పోలీసుశాఖ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని వివరించారు. గ్రామాల్లో ప్రజలు అన్నివిషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేసమయంలో గ్రామాల్లోని ఆలయాలు, దేవాలయాలకు సంబంధించిన రక్షణ విషయంలో ప్రభుత్వానికి సహకారం అందించడం ద్వారా ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారముంటుందన్నారు. గ్రామాల్లో ఆలయాలను ప్రజలు సంరక్షించుకోవడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని  అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి సూచిస్తున్నారు.