పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలి..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-01-30 17:54:17
సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 31న జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ అది వారం జిల్లాలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి 1,616 బూత్ లను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 968, పట్టణ ప్రాంతాల్లో 119, గిరిజన ప్రాంతాల్లో 529 ఏర్పాటు చేసామని తెలిపారు. 7,218 మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి చిన్నారులు పల్స్ పోలియో చుక్కలు వేసుకున్నది లేనిది పరిశీలిస్తారని తెలిపారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులు 2,33,683 మంది ఉన్నారని చెప్పారు. మూడు లక్షల డోస్ లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షణకు 158 సూపర్ వైజర్లు నియమించామని చెప్పారు. సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్ధలు, మత్స్యకార ప్రాంతాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయుటకు 83 మొబైల్ టీమ్ లు, రైల్వే స్టేషన్లు, బస్సుస్టేషన్లు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, సంతలు, జాతరలు తదితర ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం 50 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసామని వివరించారు. జిల్లాలో 275 హై రిస్క్ ప్రాంతాలు ఉన్నాయని, అచ్చట 20,608 కుటుంబాలు ఉండగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు 7,344 మంది ఉన్నారని చెప్పారు. చిన్నారులను తీసుకు వచ్చే తల్లిదండ్రులు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని డి.ఎం.హెచ్.ఓ చెప్పారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ పోలియో చుక్కలను వేయించడంలో తల్లిదండ్రులు అశ్రద్ధ వహించరాదన్నారు. ఇప్పటికి పోలియో భయం ఉందని పేర్కొంటూ 2020 సంవత్సరంలో ప్రక్క దేశాలైన పాకిస్తాన్ లో 84, ఆప్ఘానిస్తాన్ లో 56 కేసులు నమోదు అయ్యాయని, వాటి ప్రభావం ఉండవచ్చని తెలిపారు. పోలియో ద్వారా దివ్యాంగులుగా మారడం వలన ఇతరులపై ఆధారపడే అవకాశం రావచ్చని, అటువంటి పరిస్థితిని చిన్నారులకు తల్లిదండ్రులుగా కల్పించరాదని కోరారు. జిల్లాలో నువ్వల రేవులో 2004లో చివరి పోలియో కేసు నమోదు కాగా, దేశంలో 2011లో పశ్చిమ బెంగాల్ లో మత్స్యకార ప్రాంతంలో చివరి పోలియో కేసు నమోదు అయిందన్నారు. 2014 సంవత్సరం నుండి దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు చిన్నారులను పోలియో చుక్కలకు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. వాలంటీర్లు పోలియో కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షణ చేసి ఏ ఒక్కరూ తప్పిపోకుండ చూడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, పి.ఓ డిటి డా.జె.కృష్ణ మోహన్, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.