నిండు జీవితానికి - రెండు చుక్కలు..


Ens Balu
2
Visakhapatnam
2021-01-30 19:54:43

అపుడే పుట్టిన పిల్లల నుంచి 5సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పల్స్ పోలియో టీకా చుక్కలు ప్రతి సంవత్సరం వేయించుకుంటున్నాం, కాబట్టి అవసరం లేదని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు.  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం (తేదీ 31-01-2021)న జరుగుతుందని  అన్నారు. భారత దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 2011 లోను, మన రాష్ట్రంలో జులై 2008 లోను, విశాఖ జిల్లాలో జనవరి 2007 లోను నమోదు అయ్యాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత దేశాన్ని మార్చి 13, 2014 న పోలియో రహిత దేశం గా ప్రకటించిందని అన్నారు. కానీ మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లలో కేసులు నమోదు అయినందున, తప్పనిసరిగా వేసుకోవాలని ఇందులో భాగంగా జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గలిగిన 4,81,517 మంది చిన్నారులకు ఓరల్ పోలియో వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3786 పోలియో కేంద్రాలను,123 ట్రాన్సిట్ కేంద్రాలను,168 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు. 15,144  మంది వ్యాక్సినేటర్ (Vaccinator) లను,  379 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 532 హై రిస్క్ (High Risk) ప్రాంతాలు అనగా మురికి వాడలు,సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలు, మత్స్యకారుల ఆవాసాలు, ప్రయాణ సౌకర్యం లేని ప్రాంతాల (Slums, Nomads, Brick klins, Construction Areas, Fisherman Community, Hard to Reach Areas) ను గుర్తించి వాటిని  సూక్ష్మ ప్రణాళిక లో చేర్చి,  ఆ ప్రాంతాల్లోని అర్హులైన 15,746 చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.  రేపు 31-01-2021(ఆదివారం) నాడు నిర్దేశిత పోలియో కేంద్రాలలోనూ, తేదీ 01/02/2021 నుంచి 03/02/2021 వరకు (సోమ, మంగళ, బుధవారాలలో)  గృహ సందర్శనలో భాగం గా పోలియో బూత్ లలో వ్యాక్సిన్  వేయని చిన్నారులను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. ఈ వ్యాక్సిన్ 31-01-2021 (ఆదివారం) నాడు  అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్ లలో, అన్ని పంచాయతీ కేంద్రాలలోను  మరియు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలోను వేస్తారని చెప్పారు. కావున అర్హులైన చిన్నారులందరికీ  ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వేయనున్న ఈ చుక్కలు అదనపు డోసు మాత్రమేనని, ఇదివరకే వ్యాక్సిన్ తీసుకొన్నప్పటికీ మరల పల్స్ పోలియో రోజున ఈ వ్యాక్సిన్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశాల మేరకు స్త్రీ,శిశు సంక్షేమ, విద్యా, రెవిన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, గిరిజన సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖల సమన్వయంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.