పోలియో ఆదివారం విజయవంతం కావాలి..
Ens Balu
3
Kakinada
2021-01-30 20:53:35
జనవరి 31న పోలియో ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తూర్పుగోదావరి డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు తెలిపారు. శనివారం కాకినాడలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డా. గౌరీశ్వరరావు మాట్లాడారు. ఆదివారం చేపట్టనున్న పల్స్ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. అంచనాల ప్రకారం జిల్లాలో 4,69,445 మంది 0-5 ఏళ్ల వయసు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 3,22,338 మంది, పట్టణ ప్రాంతాలకు చెందినవారు 1,13,311 మంది, గిరిజన ప్రాంతాలకు చెందినవారు 33,796 మంది ఉన్నట్లు వివరించారు. మొత్తం 6,40,000 డోసులను సిద్ధంగా ఉంచామన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2296, పట్టణ ప్రాంతాల్లో 612, గిరిజన ప్రాంతాల్లో 958 మొత్తం 3,866 పోలియో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 88, పట్టణ ప్రాంతాల్లో 22, గిరిజన ప్రాంతాల్లో 30 మొత్తం 140 మొబైల్ వ్యాక్సిన్ బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ మొబైల్ బృందాలు ప్రత్యేక వాహనాల ద్వారి వివిధ మార్గాల్లో ప్రయాణించి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు తదితర చోట్ల కూడా పోలియో వ్యాక్సిన్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. 387 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. ఆశా కార్యకర్తలతో కలిపి 7470 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు వీరికి అదనంగా అంగన్‌వాడీ, ఐకేపీ, డ్వాక్రా తదితరాలకు సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఫిబ్రవరి 1, రెండో తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, వ్యాక్సిన్ వేయించుకోకుండా ఇంకా మిగిలిపోయిన చిన్నారులకు ఈ రోజుల్లో ఇస్తామన్నారు. రాజమహేంద్రవరంలో మూడో తేదీన కూడా ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం నేపథ్యంలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు.
*కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు:
కోవిడ్ టీకా వంద శాతం సురక్షితమైందని.. ఎలాంటి అపోహలకు తావు లేకుండా కోవిడ్ టీకా వేయించుకోవాలని డీఎంహెచ్‌వో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. టీకా వేయించుకున్న తర్వాత ఏమైనా జ్వరం, చిన్న దద్దుర్లు వంటివి వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫిబ్రవరి అయిదో తేదీ నుంచి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలకు చెందిన వారికి కోవిడ్ టీకా వేయనున్నట్లు డా. గౌరీశ్వరరావు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. అరుణ తదితరులు పాల్గొన్నారు.