అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..
Ens Balu
2
Visakhapatnam
2021-02-01 18:34:06
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ బద్ధమైన విధి అని, నియమ, నిబంధనల మేరకు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్ సృష్టం చేశారు. సోమవారం నాడు స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై తహసీల్దార్లు, ఎంపిడివో లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల లో ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని, ఏ మాత్రం అలసత్వం వహించినా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని తెలియ జేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎప్పటికపుడు రిపోర్టులు పంపించాలన్నారు. ఎన్నికల మ్యానువల్స్, హ్యాండ్ బుక్ లను, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, అప్పుడే క్షేత్ర స్థాయిలో తలెత్తే పరిస్థితులను అధిగమించ గలుగుతారని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి వివక్ష చూపరాదని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు వారికి కేటాయించిన ప్రాంతంలో అందుబాటులో ఉండి, కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు రెండు సార్లు శిక్షణ ఇవ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని తెలిపారు. పోలింగ్ బృందాలకు ఎన్నికల మెటీరియల్ పంపిణీ సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. పోలింగ్ అనంతరం తక్షణమే కౌంటింగ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్.గోవింద రావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య, డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఆర్డీవో లు సీతారామారావు, శివజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.