ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రారంభం..
Ens Balu
3
Vizianagaram
2021-02-01 19:43:00
రాష్ట్రంలో మరో సరికొత్త పథకం అమల్లోకి వచ్చింది.. ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే ముందుగా, విజయనగరం జిల్లాలో సోమవారం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇటీవలే కొత్తగా పంపిణీ చేసిన రేషన్ సరఫరా వాహనాల ద్వారా, రేషన్ సరుకులను లబ్దిదారుల ఇంటివద్దకే అందించే వినూతన్న పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. విజయనగరం పట్టణం, 41వ వార్డు అంబేద్కర్ కాలనీలోని 4వ నెంబరు రేషన్ డిపో పరిధిలో, సోమవారం ఉదయం 5.15 గంటలకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన ఇతర జిల్లాలకంటే ముందుగా, ఉదయాన్నే పంపిణీకి శ్రీకారం చుట్టారు. బియ్యం, పంచదార, కందిపప్పును లబ్దిదారులకు అందజేశారు. రేషన్ కార్డుదారు కోటిపల్లి ఉమ కు తొలిసారిగా సరుకులను అందించారు. ఇకనుంచీ సరుకుల కోసం కార్డుదారులు రేషన్ డిపోలవద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ప్రతీనెలా వారి ఇంటివద్దకే సరుకులు చేరనున్నాయి. ఐదు మున్సిపాల్టీల పరిధిలోని 151 రేషన్ డిపోల పరిధిలో మొత్తం 79 వాహనాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. తొలిరోజు సుమారు 6,160 మంది లబ్దిదారులకు నిత్యావసర సరుకులను అందించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్దిదారులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి పాపారావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, తాశీల్దార్ ప్రభాకర్, డిటిలు, ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో సోమవారం నుంచీ అమలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలోనే ఇతర జిల్లాల కంటే ముందుగా ఉదయం 5 గంటలకే ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రికార్డు సృష్టించామన్నారు. విజయనగరం కార్పొరేషన్‌తోపాటు బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని లబ్దిదారులకు రేషన్ సరుకులను, వారి ఇంటివద్దకే అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇంటింటికీ రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇకనుంచీ రేషన్ షాపులవద్ద క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా పోయిందని, పథకం తొలి లబ్దిదారులు కోటిపల్లి ఉమ దంపతులు అన్నారు. ఇచ్చిన సరుకుల పట్ల, తూకం పట్లా, సరుకుల నాణ్యతపట్లా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సంక్షేమం కోసం ఇటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి, ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.