రేపటి నుంచి విజయనగరంలో పంచాయతీ పోరు..
Ens Balu
3
Vizianagaram
2021-02-01 19:52:05
విజయనగరం జిల్లాలో పంచాయితీ సమరం రేపటి నుంచి ఆరంభం కానుంది. 415 గ్రామ పంచాయితీల ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనువెంటనే జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 117 క్లష్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ఫేజ్-2 ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో ఈ నెల 13న గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, కురుపాం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 15 మండలాలకు చెందిన 415 గ్రామ పంచాయితీల్లోని సర్పంచ్ పదవులకు, వార్డులకు ఈ విడత ఎన్నికలు జరుగుతాయి. ఈ గ్రామాల్లో మంగళవారం నుంచీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతీ నాలుగైదు పంచాయితీలకు కలిపి క్లష్టర్ల వారీగా, మొత్తం 117 క్లష్టర్లలో నామినేషన్లను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. తొలిదశ ఎన్నిక జరిగే ప్రాంతాన్ని 67 జోన్లుగా, 121 రూట్‌లుగా విభజించారు. స్టేజ్ 1 లో మొత్తం 147 మంది ఆర్ఓలు, 147 మంది ఏఆర్ఓలు, స్టేజ్ 2లో 4,299 పిఓలు, 5,109 మంది ఓపిఓలు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ పొందారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 172 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. అలాగే ఇలాంటి ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియతోపాటు, ప్రచారం, ఓటింగ్ మొదలగు వివిధ దశలను 74 మంది వీడియో గ్రాఫర్లద్వారా వీడియో రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
2వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటలు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. 5వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు అప్పీల్ చేసుకొనేందుకు 6వ తేదీ సాయంత్రం 5 గంటలు వరకు గడువుంది. అప్పిలేట్ అధికారి వారి అప్పీళ్లను 7వ తేదీన పరిశీలిస్తారు. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకూ నామినేషన్లను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ 15 మండలాల్లో 3,908 పోలింగ్ కేంద్రాల ద్వారా 13వ తేదీ ఉదయం 6.30 నుంచి 3.30 గంటలు వరకూ ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, విజేతను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఈ 415 పంచాయితీల్లో మొత్తం 6,19,834 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,06,633 మంది కాగా, మహిళా ఓటర్లు 3,13,164 మంది, 37 మంది ఇతరులు ఉన్నారు.