రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణ..


Ens Balu
4
Srikakulam
2021-02-01 19:54:02

రాజ్యాంగబధ్ధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ తెలిపారు.  సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమీషనరు ఎన్.రమేష్ కుమార్ మాట్లాడారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పరిశీలస నిమిత్తం జిల్లాలలో పర్యటనలో భాగంగా సోమవారం శ్రీకాకుళం పర్యటనకు  ఆయన వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ రాజ్యాంగ నిర్దేశానుసారం ఏర్పడినదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు పునాది అని, ఎన్నికల కమీషన్ స్వీయ నియంత్ర పాటిస్తుందని తెలిపారు. నిబంధనల పరిమితికి, పరిధికి లోబడి బాధ్యతలు  నిర్వహించడం జరుగుతుందన్నారు.  న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం వున్నాయని న్యాయ వ్యవస్థపై విశ్వాసంతోను, విధేయతతోను పనిచేస్తున్నట్లు చెప్పారు.అన్ని వ్యవస్ధలు రాజ్యంగం సూచించిన మేరకు పని చేయడం వలన మంచి వ్యవస్ధ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేఛ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాలని,  సమాజంలో మంచి మార్పు  తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 73, 74 ద్వారా పంచాయతీలకు నిధులు, విధులను నిర్దేశించడం జరిగిందన్నారు.బాధ్యతాయుతమైన నాయకత్వం రావాలని కోరారు.  ఆరోగ్యకరమైన పోటీతో , పారదర్శకమైన ఎన్నికల ద్వారా పటిష్టవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని తెలిపారు. త్వరలోనే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, యాప్ ను రూపొందించనున్నామని , ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మీడియా ద్వారా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందుతుందని తెలిపారు. మంచి చెడులను మీడియా విశ్లేషణ చేస్తుందని తద్వారా సమాజానికి మంచి సందేశం వెళుతుందని పేర్కొన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై మాట్లాడుతూ అన్ని వర్గాలు సమైఖ్యంగా కలసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదేనని అన్నారు. అసామాన్యంగా ఏకగ్రీవాలు జరగడం మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా, నైతికంగా అటువంటి ఎన్నికలు చెల్లుబాటు కాదని స్పష్టం చేసారు.  గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, జిల్లాపై అభిమానం వుందని చెప్పారు.  జిల్లాలో ప్రతిభావంతులైన అధికారులున్నారని ఇది చాలా సంతోషదాయకమని అన్నారు.  ఎన్నికల  నిర్వహణ పట్ల చాలా సంతృప్తిగా వుందన్నారు.మానవ వనరుల లభ్యత దృష్ట్యా పనిభారం ఉద్యోగులపై కొంత ఉండవచ్చని అయితే ఆకుంఠితదీక్షతో ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిర్వహణ చేయడం శుభసూచకమన్నారు. తద్వారా ఎటువంటి విపత్కర పరిస్ధితులను అయినా చక్కగా ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వంశధార, నాగావళి వరదలు, ఇతర విపత్కర పరిస్ధితుల్లో ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని అన్నారు.   జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా పంచాయితీ ఎన్నికల నిర్వహణ పట్ల వివరించారు. జిల్లాలో నాలుగు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఆదివారంతో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని తెలిపారు.  పోలింగు సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని, ఎం.సి.సి. టీమ్ నియమించామని, చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసామని తెలిపారు.  కలెక్టరేట్ లోను  కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసామని తెలిపారు.  బ్యాలట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ సిధ్ధం చేయడం జరిగిందని కలెక్టర్ ఎన్నికల కమీషనర్ కు వివరించారు.జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.                 ఈ మీడియా సమావేశంలో  రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేక అధికారి అదనపు పోలీసు డైరక్టర్ జనరల్ సంజయ్, డి.ఐ.జి. ఎల్.కె.వి.రంగారావు, జిల్లా పోలీసు సూపరెంటెండెంటు అమిత్ బర్దార్, సంయుక్త కలెక్టర్లు సుమీత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.