రిటర్నింగ్ అధికారులు కీలకంగా వ్యవహరించాలి..
Ens Balu
3
Kakinada
2021-02-01 20:05:20
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో రిటర్నింగ్ (ఆర్‌వో) అధికారుల పాత్ర చాలా కీలకమైందని.. జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జరిగిన స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జెడ్‌పీ సీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన కార్యాచరణ, సమయపాలనతో ఎన్నికల విధులను పూర్తి బాధ్యతతో నిర్వర్తించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఆర్‌వోలు.. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ దగ్గరి నుంచి సర్పంచ్/ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల జారీ వరకు ప్రతి విషయంలోనూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించాలన్నారు. బ్యాలెట్ పెట్టెలను అన్ని విధాలా సరిచూసుకొని సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా సందేహం వస్తే వెంటనే ఉన్నత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదే విధంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారుల ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలను రిసోర్స్ పర్సన్ టీఎస్ఎస్ఆర్ మూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.