ఫీజుల వసూలుకు ఏక రూప విధానం..
Ens Balu
2
Vizianagaram
2021-02-01 20:08:20
ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని.. ఇక నుంచి ఏకరూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకొస్తామని పాఠశాల విద్యా నియంత్రణ మరియు పరిశీలన కమిషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు ప్రొ. వి. నారాయణ రెడ్డి, సి.ఎ.వి. ప్రసాదు సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం రూరల్ పరిధిలోని మల్లిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. మనబడి నాడు-నేడు పనులను, అక్కడ కల్పించిన ఇతర వసతులను పరిశీలించారు. అనంతరం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల, జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు, వసతుల కల్పనకు, విద్యలో నాణ్యత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దానిలో భాగంగానే కమిషన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న జూనియర్ కళాశాలలు, పాఠశాలలను దశల వారీగా తనిఖీ చేస్తామని చెప్పారు. విజయనగరం జిల్లాలో విద్యా పథకాల అమలు బేషుగ్గా ఉందని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన, మనబడి నాడు-నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకాల అమలు తీరు బాగుందని, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.
విద్యా వ్యవస్థ రూపు మార్చేందుకు సంస్కరణలు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టిందని, మరిన్ని మార్పులు తీసుకొచ్చి సరికొత్త విద్యావిధానం అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొన్నారు. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి, మనబడి నాడు-నేడుతో మార్పు మొదలయిందన్నారు. రూ.27వేల కోట్లతో పాఠశాలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. త్వరలోనే ఏక రూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకొస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటే ఫీజు విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో, జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల కమిటీ ఉండేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని, నైపుణ్యతలు మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు సూచించారు.
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్, టోల్ ఫ్రీ నెంబర్
ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉండే సమస్యలపై నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ ; 9150381111 లేదా apsermc@apschooledu.in మెయిల్‌ని సంప్రందించి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల నిమిత్తం https://apsermc.ap.gov.in చిరునామాతో ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కోవిడ్ నేపథ్యంలో 30 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, కాని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే ప్రతి జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల్లో, జూనియర్ కళశాలల్లో టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ తెలిసిలే పోస్టర్లు అంటిస్తామని, నోటిస్ బోర్డుల్లో డిసప్లే చేస్తామని చెప్పారు. అయితే అన్ని పనులూ ప్రభుత్వమే చేయలేదని తల్లిదండ్రలు కూడా ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందే విద్యపై, వసతులపై ప్రశ్నించాలని కమిషన్ సభ్యులు సూచించారు. ఫీజులు, వసతుల కల్పనపై పేరెంట్స్ కమిటీలు ఆరా తీయాలని, అందరిలో చైతన్యం వచ్చినప్పుడే ఫీజుల విధానంలో నియంత్రణ తీసుకురాగలమని కమిషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. యూనిఫారాలు, ప్రత్యేక పుస్తకాలు, ఐఐటీ పేర్లతో ప్రయివేటు పఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విలేకరులు అడగ్గా ప్రతి సమస్యకూ త్వరలోనే పరిష్కారం చూపిస్తామని సభ్యులు పేర్కొన్నారు.
సమావేశంలో డీఈవో జి.నాగమణి, డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్, విద్యాశాఖ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.