ఎన్నికల నిర్వహణకు సామాగ్రి సిద్దం..
Ens Balu
3
Kakinada
2021-02-01 20:35:38
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన యావత్ సామాగ్రిని సిద్దం చేసామని, శిక్షణా కార్యక్రమాలతో అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్, రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శులు ఉమ్మడిగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు జిల్లాల్లో చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి పాల్గొంటూ ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు, వివిధ ఫారమ్ లు, సీళ్లు, చెరగని ఇంకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాలెట్ పత్రాల పరిశీలన నిర్వహించి, అదనంగా అవసరమైన వాటి ముద్రణ చేపడతామని తెలియజేశారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని, కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఫిర్యాధుల పరిశీలన, ఎన్నికల సమాచార సేవలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్-19 పరమైన అన్ని జాగ్రత్తలు, రక్షణ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అవసరమైన ధర్మల్ స్కానర్లు సేకరిస్తున్నామన్నారు. పోలవరం ప్రోజెక్ట్ ముంపు గ్రామాల నుండి పునరావాస కాలనీలకు తరలి వెళ్లిన ఓటర్లు, తమ పూర్వ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుందుకు వీలుగా రవాణా ఏర్పాటు చేసేందుకు అనుమతి జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, డిపిఓ నాగేశ్వరనాయక్, జడ్ పి సిఈఓ ఎన్ వి వి సత్యన్నారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.