సజావుగా ఎన్నికలు నిర్వహించాలి..


Ens Balu
3
Nellore
2021-02-01 20:57:14

పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి  గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమీషనరు  గిరిజాశంకర్ , ఎన్నికల కార్యదర్శి  కన్నబాబుతో కలసి విజయవాడ నుండి సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేస్తూ పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలు కేటాయింపులలో మరియు స్ట్రాంగ్ రూముల భద్రతపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ జిల్లా కలెక్టరు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పంచాయతీఎన్నికలు పటిష్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. జిల్లాలో నాలుగు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరియు కౌంటింగ్ సామాగ్రిని సిద్థం చేశామని, అలాగే తొలి విడతకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను ఇప్పటికే సిద్థం చేశామని, అభ్యర్థుల నామినేషన్ పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటించగానే బ్యాలెట్ పత్రాల ముద్రణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు  చక్రధర్ బాబు, పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితం గా అమలు జరిగేలా మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు యివ్వడం జరిగిందని, అలాగే కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి పోలింగ్ జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టరు వివరించారు. జిల్లాలో 24,640 మంది పోలింగ్ సిబ్బందిని గుర్తించి వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను షెడ్యూలు వారీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు.