తొలి దశ పోలింగ్ కు అన్నీ సిద్ధం..


Ens Balu
2
Visakhapatnam
2021-02-01 21:31:07

గ్రామ పంచాయతీ ఎన్నికలలో తొలి విడత పోలింగుకు సిద్ధం కావాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల క్రిష్ణా ద్వివేది అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తో కలిసి అన్ని జిల్లాల  కలెక్టరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ, పోలింగ్ సామాగ్రి  నాణ్యంగా ఉన్నదీ లేనిది సరి చూసుకోవాలన్నారు. ఓటరు వేలి పై వేసే మార్క్ కు సంబంధించిన సిరా పరిశీలించాలన్నారు పి.వో.లు, ఏ.పీ.ఓ.ల నియామకం పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ  జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అనకాపల్లి డివిజన్ లో పోలింగుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు.  నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, స్క్రూటినీ, విత్ డ్రాయల్ తరువాత బ్యాలెట్ పేపర్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణ సామాగ్రి  ఆయా ఎం.డి.ఓ. కార్యాలయాలకు పంపించడం జరిగిందన్నారు. స్టేషనరీ, ఇంకు, బ్యాలెట్ బాక్సులు అన్నీ సిద్ధం చేస్తున్నామని, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా తరగతులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, పి. అరుణ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి, జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. నాగార్జునసాగర్ తదితరులు పాల్గొన్నారు.