పోలింగ్ శాతాన్ని పెరిగేలా చూడండి..
Ens Balu
2
Visakhapatnam
2021-02-02 14:10:02
విశాఖజిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోలింగు శాతం కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శాంతి భద్రతలు, నోడల్ అధికారులు, పోలింగ్ అధికారులు, బ్యాలెట్ పేపర్లు, మొదటి విడత నామినేషన్ల ఘట్టం, తదితర విషయాలపై ఎన్నికల కమిషనర్ కు వివరించారు. అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పాడేరు ఆర్డిఓ శివజ్యోతి, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్ ఎన్నికల ఏర్పాట్లపై, గతంలో పోలింగ్ శాతం, ఏక గ్రీవాలు, పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు, మేన్ పవర్ ,రూట్లు, జోన్లు, శిక్షణలు, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ అమలు తదితర అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు. డిసిపి ఐశ్వర్య రస్తోగి, నర్సీపట్నం ఎఎస్పి తుహిన్ సిన్హా, చింతపల్లి ఎఎస్పి విద్యాసాగర్ రెడ్డి, పాడేరు డిఎస్పి రాజ్ కమల్, అనకాపల్లి డిఎస్పి, ఎసిపిలు ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, వాహనాలు తనిఖీ, సమస్య, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, వాహనాల తనిఖీ, గ్రామాల సందర్శన, తదితర విషయాలపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు వివరించారు.
ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రతిభావంతమైన అధికారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతియుతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు పట్ల జిల్లా కలెక్టర్ ను, జిల్లా పోలీసు అధికారులను అభినందించారు.
ఈ సమావేశంలో నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, అదనపు డి.జి. ఎన్. సంజయ్, డిఐజి ఆఫ్ పోలీస్ కె.రంగారావు, ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, ఎఎస్పి, డిఎస్పి, ఎసిపిలు, జడ్పి సిఇఓ, నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.