కోవిడ్ వేక్సిన్ పట్ల అపోహలు వద్దు..
Ens Balu
3
Vizianagaram
2021-02-03 17:32:48
కోవిడ్-19 వేక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, దీనిపట్ల అపోహలు విడనాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. ప్రతీఒక్కరూ వేక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో రెండో విడత కోవిడ్-19 వేక్సినేషన్ ప్రక్రియ బుధవారం మొదలయ్యింది. స్థానిక రాజీవ్‌నగర్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ సతీసమేతంగా హాజరై, స్వయంగా తాను వేక్సిన్ వేయించుకొని, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రెండో విడత కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సుమారు 27 వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 38 వేక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత కార్యక్రమం క్రింద వైద్యారోగ్య సిబ్బంది, అంగన్‌వాడీలు తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వేక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరికోసం 32 సెంటర్ల ద్వారా సుమారు 14వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 11వేల మంది వరకూ వేక్సిన్ వేయించుకున్నారు. వీరికి కూడా మరోవైపు వేక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
అపోహలు విడనాడాలి ః కలెక్టర్
కోవిడ్ వేక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ కోరారు. వేక్సిన్ వేయించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోవిడత వేక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, ఈ నెల 16 వరకూ దీనిని కొనసాగిస్తామని చెప్పారు. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో మన జిల్లా ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని, గత కొన్ని నెలలుగా మరణాలు లేవని చెప్పారు. అయినప్పటికీ మనంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్లే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వేక్సిన్ వేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలు, కొన్ని రకాల మందులు పడనివారు, అలర్జీలు ఉన్నవారు మాత్రమే వేక్సిన్ వేయించుకోకూడదని అన్నారు. ప్రజారోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి శైలజా బాయి, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.